బెజవాడలో రాజకీయ రణరంగం

కృష్ణా జిల్లాలోని ప్రధాన సీట్లలో రాజకీయం కత్తులు దూస్తోంది. ఇక్కడ ఎన్నికల ప్రకటనకు ముందే నియోజకవర్గాల్లో రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. విజయవాడలో నేతల మధ్య మాటల యుద్ధం, గుడివాడలో గరం గరం, మైలవరంలో తీవ్ర స్వరం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయంగా కీలకమైన కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలతో ఎన్నికల యుద్ధానికి కదనరంగంలో దిగిపోయాయి. 2014 ఎన్నికల్లో 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 11, వైసీపీ 5 స్థానాలు గెలిచాయి. తర్వాత వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ బలం 3కి తగ్గింది. దీంతో ఈసారి ఎన్నికలను ప్రధాన పార్టీలు మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కొన్ని సీట్లలో పాత వైరాలతో పోటీ గరం గరంగా మారింది. మైలవరం, గుడివాడ, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, పామర్రు అసెంబ్లీ స్థానాలు బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హాట్‌ కేకుల్లా మారాయి. ఈ స్థానాల్లో పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ముందే ఆయా నియోజకవర్గాలను రణరంగంలా మార్చిన నాయకులు ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుడివాడ, మైలవరం అసెంబ్లీ స్థానాలతో పాటు బెజవాడ పార్లమెంటు స్థానంలో అభ్యర్థుల దూకుడు దేనికైనా రెడీ అన్నట్టుగా ఉంది.

బెజవాడ ఎంపీ సీటు మొదటి నుంచీ హాట్‌ సీటే. ఇక్కడి నుంచి పోటీ చేసే వారిపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోకస్ ఉంటుంది. ఇక్కడి గెలుపోటములపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ ఎంపీగా లక్షకు పైగా మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా టీడీపీ నుంచి కేశినేని నాని బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో పొట్లూరి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనుకున్నా చివర్లో అది జరగలేదు. జనసేన మద్దతుతో పొట్లూరి పోటీ చేయబోతున్నారని వార్తలు రాగానే ఆయనపై కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ నేరస్తుడని నిందించడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు మిస్సయినా ఈసారి ఆ ఇద్దరే ప్రత్యర్థులు కావడంతో విజయవాడ పార్లమెంట్ రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. బెజవాడ ఎంపీ స్థానం అంటే ఖర్చు 100 కోట్ల పైమాటేనని ప్రచారం కూడా ఉంది. మరోసారి కేశినేని నాని, పీవీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.