టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం చెక్. నేడు శుక్రవారం (ఫిబ్రవరి 26) ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్’పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు.
కథ: ఆదిత్య ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలతో దొంగతనలు చేస్తూ ఉంటాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే… భారత్‌లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య ఉరిశిక్ష పడుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్ చెస్ చాంపియన్ షిప్ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు.
ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్ లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) ప్రయత్నిస్తుంది. చెస్‌లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్ రాజ్) ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభింస్తుందా.. ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు.. యాత్ర ఎవరు? చెస్ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ
నటీనటులు: చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదిత్య పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. ఒక చెస్ చాంపియన్ ఎలా ఆడగలడో, ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయగలడో అచ్చుగుద్దినట్లు నితిన్ నటన ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశాడు. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. లాయర్ పాత్రలో రకుల్ అద్భుతంగా నటించింది. నితిన్ తరువాత ఈస్థాయిలో ఉన్న పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఇక మరో హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్‌కు ఇది తొలి తెలుగు సినిమా అయినప్పటికి యాత్ర పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ సినిమాకు ఆమె సన్నివేశాలే కీలకం. ఎస్పీ పాత్రలో సంపత్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో పోసాని, జైలర్‌గా మురళి శర్మ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ: వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. చెక్ విషయంలో కూడా గత సినిమాలే మాదిరే మైండ్ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్ గేమ్ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా చాలా సాధారణంగా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి.
ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్ కొట్టించే అంశం. ఇక నేషనల్ చెస్ ఛాంపియన్ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వచ్చి అలా వేళ్తున్నట్లు అనిపిస్తోంది. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇక్కడా దర్శకుడు యేలేటి తన మార్క్‌ను చూపించాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తోంది. అయితే హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్.
టైటిల్: చెక్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని తదితరులు
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వి. ఆనంద ప్రసాద్
సంగీతం: కల్యాణీ మాలిక్
హైలైట్స్: నితిన్, సాయిచంద్ నటన
డ్రాబ్యాక్స్: కొన్ని సాగతీత సన్నివేశాలు
చివరిగా: ఒక సారి చూడగలిగే చిత్రం ‘చెక్’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)