HomeTelugu Reviews'భోళా శంకర్' మూవీ రివ్యూ

‘భోళా శంకర్’ మూవీ రివ్యూ

Bhola Shankar Review

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇదే జోష్‌లో ఈ రోజు ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరంజీవి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కలకత్తాలో అమ్మాయిల కిడ్నాపులు కలకలం సృష్టిస్తాయి. ప్రభుత్వం, పోలీసులు కూడా ఆ మాఫియాను కట్టడి చేయలేకపోతాయి. మాఫియా హెడ్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా)ను ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. ఇక శంకర్ (చిరంజీవి) అదే టైంలో కలకత్తాకు తన చెల్లి మహాలక్ష్మీ (కీర్తి సురేష్) చదువు కోసం వస్తాడు. బతుకుదెరువు కోసం ట్యాక్సీ డ్రైవర్‌గా మారుతాడు శంకర్. సిటీలో జరిగే కిడ్నాపుల వెనుక ఉన్న క్రిమినల్స్ గురించి సిటీలోని డ్రైవర్లందరికీ అవగాహన కల్పిస్తారు పోలీసులు. దీంతో ఓ గ్యాంగ్‌లోని వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం అందిస్తాడు శంకర్. ఆ తరువాత శంకర్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి.. అసలు శంకర్ కలకత్తాకు ఎందుకు వచ్చాడు.. దాదాగా ఉండే భోళా శంకర్.. శంకర్‌గా ఎలా మారాడు.. మహా లక్ష్మీకి శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి.. వీళ్లద్దరికీ ఆ మాఫియాతో ఉన్న కనెక్షన్ ఏంటి? ఆ మాఫియాను ఎలా నిర్ములిస్తాడు. అనేదే కథలోని అంశం.

మెగాస్టార్ సినిమా అంటే..ఆయన యాక్టింగ్, కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే ఈ సినిమాలోనూ అదే జరిగింది. చుట్టూ ఎంత మంది నటీనటులున్నా, కమెడియన్లున్నా, మిల్కీ బ్యూటీ ఉన్నా కూడా చిరంజీవి మాత్రమే కనిపిస్తాడు. వినిపిస్తాడు. భోళా శంకర్ సినిమాలో కావాల్సినంత మంది కమెడియన్లు, ఆర్టిస్టులున్నారు. కానీ దర్శకుడు ఏ ఒక్కరినీ పూర్తిగా వినియోగించలేదనిపిస్తుంది. ఏ కామెడీ ట్రాక్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్‌ను అయితే జనాలు సహన పరీక్షలానే ఫీల్ అయ్యేట్టుగా ఉంది.

ప్రథమార్దంలో ఏ ఒక్క సీన్ కూడా నవ్వించలేకపోతుంది. ఏ ఒక్క ఎమోషన్‌కి కనెక్ట్ కాలేకపోయింది. కామెడీ పేరిట తమన్నా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ కాస్తా వెకిలిగా మారిపోయింది. అందరిదీ ఓవర్ యాక్షన్ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక చిరంజీవి లాంటి వ్యక్తి చేత చేయించిన కామెడీని కొన్ని చోట్ల ప్రేక్షకులు భరీంచలేని విధంగా ఉంది. రీమేక్ అని తెలిసినా, ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా తీయలేకపోయాడు. కావాల్సినంత కామెడీకి స్కోప్ ఉన్నా నవ్వు పుట్టించేలా చేయలేకపోయాడు. ఇది కచ్చితంగా దర్శకుడి తప్పే అవుతుంది.

Bhola Shankar

ప్రథమార్దాన్ని ఎలాగోలా తట్టుకుని సెకండాఫ్ వరకు ఆడియెన్స్ ఓపిక పడితే కాస్త రిలాక్స్ అనిపించే సీన్లు వస్తాయి. ద్వితీయార్దంలో కీర్తి సురేష్, చిరంజీవి మధ్య వచ్చే రెండు మూడు సీన్లు బాగుంటాయి. మిగతాది అంతా కూడా రొటీన్‌గా అనిపిస్తుంది. ఏ ఒక్క షాట్, సీన్ కూడా కొత్తగా ఉండదు. పైగా వేదాళంలోని సీన్లను ఉన్నది ఉన్నట్టుగా తీసేశాడు మెహర్ రమేష్.

ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌లా చిరు నటించడం కూడా అంతగా సెట్ అవ్వలేదు. ఇక ఖుషీ సీన్ రీ క్రియేట్ చేయాలనుకోవడం కూడా మెహర్ రమేష్ పొరబాటే అవుతుంది. ఇక శ్రీముఖితో చేయించింది కామెడీ అనుకుంటే అంత కంటే ఘోరం ఇంకేమీ ఉండదు. సత్య, బిత్తిరి సత్తి, లోబో, వేణు, తాగుబోతు రమేష్, ఆది, వైవా హర్ష ఇలా స్క్రీన్ మీద ఎంత మంది కనిపించినా, పంచ్ వేసినా నవ్వురాదు. ఎవ్వరినీ కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. సుశాంత్, తమన్నా ఇలా అందరూ కూడా కూరలో కరివేపాకులా అనిపిస్తారు. విలనిజం కూడా పెద్దగా ఆకట్టుకోదు.

హీరో చేతిలో తన్నులు తిని, చావడానికే అన్నట్టుగా విలన్ పాత్రలు కనిపిస్తాయి. రాజా రవీంద్ర, బ్రహ్మాజీల పాత్రలను ఓకే అనిపించేలా డిజైన్ చేశాడు మెహర్. అయితే రీమేక్‌లను మెహర్ రమేష్ బాగానే హ్యాండిల్ చేస్తాడన్న మాటలను ఈ భోళా శంకర్‌తో పొగగొట్టుకున్నాడు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఎవ్వరైనా సరే ఊహిస్తాడు. అందులోనూ ఎలాంటి కొత్తదనం లేదు.

అవుట్ డేటెడ్ కథను, మరింత అవుట్ డేటెడ్‌గా మెహర్ తెరకెక్కించాడు. సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఈ సినిమా చిరంజీవి కోసం మాత్రమే చూడాలి. చిరు కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. కానీ ఇందులో చిరు చేసిన కామెడినీ కూడా ఎంజాయ్ చేయలేకపోయేలా చేశాడు మెహర్. నిర్మాణ విలువలు బాగున్నాయి. దానిని దర్శకుడు వినియోగించుకోలేక పోయాడు.

టైటిల్‌ : భోళా శంకర్‌
నటీనటులు: చిరంజీవి,తమన్నా,కీర్తి సురేష్, శ్రీముఖి తదితరులు

నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం:మెహర్ రమేష్
సంగీతం: మహతి స్వర సాగర్

చివరిగా: కేవలం చిరంజీవి కోసం మాత్రమే చూడాలి

Recent Articles English

Gallery

Recent Articles Telugu