HomeTelugu Newsప్రజావేదిక కూల్చివేత.. జగన్‌ సంచలన నిర్ణయాలు

ప్రజావేదిక కూల్చివేత.. జగన్‌ సంచలన నిర్ణయాలు

8 22ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజావేదిక కూల్చివేతతోనే అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ చర్యలు మొదలవుతాయన్నారు. అవినీతిని ఏమాత్రం సహించనని హెచ్చరించారు.

‘ప్రజలకు మనం సేవకులన్న విషయం ప్రతి నిమిషం గుర్తించుకోవాలి. మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియని పరిస్థితి నుంచి మార్పు రావాలి. నవరత్నాలే మన మేనిఫెస్టో అన్నది గుర్తుంచుకోవాలి. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలి. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. అందరం సమష్టిగా పనిచేస్తేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయగలుగుతాం. వచ్చే ఎన్నికల నాటికి మేనిఫెస్టోను పూర్తి చేశామని చెప్పగలగాలి’

‘ఫలానావాళ్లు ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. 2 లక్షల మంది ఓట్లేస్తేనే ఎమ్మెల్యేలయ్యారని మరిచిపోవద్దు. ఎమ్మెల్యేలు గానీ, ప్రజలు గానీ కలెక్టర్ల వద్దకు వస్తే చిరునవ్వు కనబడాలి. ప్రజల నుంచి సమస్యలను ఎమ్మెల్యేలు తీసుకొని వస్తారు. వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ పథకమైనా ప్రజలకు సకాలంలో అందించాలి. ఏ పథకం అందించకపోయినా మనం తప్పుచేసినట్లే’

‘అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేయాలి. పేదలు, రైతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి. ఎన్నికలయ్యే వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అందరూ మనవాళ్లే.

‘ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. 2 వేల మంది నివాసం ఉన్న చోట గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. 50 ఇళ్ల బాధ్యత గ్రామ వాలంటీర్‌దే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేస్తాం. అర్హుడైన లబ్ధిదారుడికి ప్రతి పథకం అందాలి. గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్‌ చేయాలి. తప్పు జరిగితే వెంటనే వారిని తొలగిస్తాం.

వ్యవస్థను మార్చాలన్నదే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఇది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలి. చెడిపోయిన వ్యవస్థ మారాలని నేను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా. ప్రతి అడుగులోనూ పారదర్శకత కనిపించాలి. ప్రజలు హక్కుగా పొందాల్సిన సేవలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. కార్యాలయాల చుట్టూ తిరిగేలా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. నేను పాదయాత్ర చేసేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించా. ప్రభుత్వ యంత్రాంగమంతా నిజాయతీగా పనిచేయాలి. అవినీతి రహిత పాలన అందించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం.’

‘మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణమేనా?. ఈ భవనం అవినీతి సొమ్ముతో కట్టింది. అక్రమంగా నిర్మించిన భవనమని తెలిసీ ఇక్కడే మనం సమావేశం పెట్టుకున్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా. ప్రక్షాళన ఈ భవనం నుంచే ప్రారంభం కావాలి. ఎల్లుండి నుంచే ఈ భవనం కూల్చివేత పనులు చేపడతాం. ఇదే ఈ భవనంలో చివరి సమావేశం. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దాం. ‘అని జగన్‌ అధికారులకు పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu