48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్!

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్  కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.  సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల  టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. కాగా ఈ చిత్ర తమిళ వెర్షన్ టీజర్‌తో పాటు తెలుగు వెర్షన్ టీజర్‌కు కూడా అద్భుత స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన 48 గంటల్లో ఎస్-3 టీజర్‌కు 5మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత  మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ”సూర్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. మొదట్నుంచీ ఈ చిత్రానికి సంబంధించిన ఏ అంశమైనా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కు లభించిన స్పందనకు మించిన స్పందన టీజర్‌కు లభించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేసి,  డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు.