టీడీపీ గూటికి సీబీఐ మాజీ జేడీ..? భీమిలి నుంచి బరిలోకి..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్‌ పోటీ చేయాలని భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో సీబీఐ సంయుక్త సంచాలకుడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసుల్ని దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన ప్రభుత్వ సర్వీస్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నా ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ చొరవ తీసుకుని ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. లక్ష్మీనారాయణ, సీనియర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.