HomeTelugu Reviews'గాండీవధారి అర్జున' మూవీ రివ్యూ

‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ

Gandeevadhari Arjuna Movie Review
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచేశాయి. మరి ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కథ ఏంటీ.. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం..

భారత్‌కు చెందిన పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) లండన్‌లో జరిగే యూఎన్ క్లైమేట్ సమావేశాలకు వెళ్తాడు. మంత్రి పీఏగా ఐరా (సాక్షి వైద్య) ఉంటుంది. అక్కడ యూనివర్సిటీకి చెందిన ఓ అమ్మాయి మంత్రిని కలిసి ‘ఫైల్ 13’ గురించి చెప్పాలని అనుకుంటుంది. ఆ ‘ఫైల్ 13’ కోసం క్లీన్ అండ్ గ్రీన్ (సీ అండ్ జీ)కంపెనీ అధినేత రణ్వీర్ (వినయ్ రాయ్) ప్రయత్నిస్తాడు. తన కంపెనీ సీక్రెట్లు అందులో ఉండటంతో దాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అసలు ఆ ఫైల్‌లో ఏముంది? రణ్వీర్‌కు మంత్రికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలోకి అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ఎలా వస్తాడు? అర్జున్ వర్మ, ఐరా (సాక్షి వైద్య)కి ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు అర్జున్ వర్మ ఏం చేశాడు? అనేది కథ.

కొత్త పాయింట్‌ను చెప్పాలని అనుకున్నప్పుడు దాని చుట్టూ అల్లుకునే కథ, చూపించే కథనం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండాలి. వాటర్ మాఫియా, వాటర్ బాటిళ్ల గురించి కార్తీ సర్దార్‌లో ఎంతో బాగా చూపించారు. కొత్త పాయింట్లు.. వాటి చుట్టూ అల్లిన కథ, ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతాయి. ఈ గాండీవధారి అర్జున కూడా చెత్త, చెదారం వల్ల ప్రకృతికి జరిగే నష్టం, గాలి, నీళ్లు కలుషితం అవ్వడం, మానవాళికి ముప్పుగా మారుతుండటం వంటి కాన్సెప్ట్‌ మీదే జరుగుతుంది.

ఫారిన్‌లో ఉండే చెత్తను ఇండియాలో డంప్ చేయడం, ఇండియా వనరులు నాశనం అవుతుండటం, ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయితే వచ్చే ప్రమాదాలు.. ఇలా చాలా పాయింట్లను దర్శకుడు టచ్ చేశాడు. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. కానీ తెరపై ప్రేక్షకుడ్ని రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టేలా చేయడంలోనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ప్రవీణ్ సత్తారు అంతగా సక్సెస్ కాకపోవచ్చు. ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. తెరపై లగ్జరీ కనిపిస్తుంది. కానీ కథలో ఎమోషన్ కనిపించదు.

తల్లీకొడుకు ఎమోషన్ వర్కౌట్ అవ్వదు.. హీరో హీరోయిన్ ట్రాక్‌లోనూ ఎమోషన్ కనిపించదు.. ఇలా ఏ పాత్రను కూడా సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ఏ ఒక్క పాత్రకు కూడా ఆడియెన్ కనెక్ట్ అవ్వడు. సీన్లకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే.. ఎన్నో లాజిక్ లేని సన్నివేశాలు కనిపిస్తాయి. ఇంటర్ పోల్ అధికారులు హీరోను పట్టుకోవడంలో చూపించే శ్రద్ద, వేగం.. విలన్‌ను పట్టుకోవడంలో చూపించరు. అసలు ఇంటర్ పోల్ అధికారులు అంతగా హీరో వెనక ఎందుకు పడతారు అన్నది కూడా ఆశ్చర్యం వేస్తుంది. విలన్‌ను ఎంతో భయంకరంగా చూపిస్తారని అనుకుంటాం. కానీ చివరకు హీరో ఆ విలన్లను టపీటపీమని కాల్చుకుంటూ వెళ్తూనే ఉంటాడు. చివరి వరకు తన స్థావరానికి హీరో వచ్చాడని కూడా విలన్ కనిపెట్టలేకపోతాడు.

అసలు హీరో చేసేది ఏ పని.. ఏ డిపార్ట్మెంట్.. ఆర్మీ, రా.. ప్రైవేట్ ఏజెన్సీ ఇలా ఏంటన్నది కూడా క్లారిటీగా అనిపించదు. చాలా చోట్ల క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న పాయింట్ ఆలోచింపజేసేదే అయినా.. తెరపై ఆకట్టుకునేలా, అందరూ మెచ్చేలా, ప్రశంసించే సినిమాగా మాత్రం మలచలేకపోయినట్టు అనిపిస్తుంది. టెక్నికల్‌గా ఈ సినిమా మెప్పిస్తుంది. మిక్కీ పాటలు గుర్తుండకపోయినా ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ బాగుంది. చేజింగ్ సీన్లు బాగా అనిపిస్తాయి. తక్కువ నిడివి కలిసి వస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ తేజ్ చేసే యాక్షన్ సీక్వెన్సులు బాగుంటాయి. సాక్షి వైద్యకు స్కోప్ ఉన్న పాత్ర దక్కినా కూడా ప్రవీణ్ సత్తారు సరిగ్గా ప్రజెంట్ చేయలేదనిపిస్తుంది. గ్లామర్ పరంగా సాక్షి మెప్పిస్తుంది. విలన్‌గా వినయ్ రాయ్ ఏ మాత్రం ప్రభావం చూపించడు. నాజర్‌కు తన సత్తాను చాటే పాత్రేమీ కాదు. అభినవ్ గోమఠంది సడెన్‌గా సెకండాఫ్‌లో అలా కనిపించి హీరోకు సాయం చేసి వెళ్లిపోయే మామూలు పాత్ర. ప్రియా (విమలా రామన్), రియా, రవి వర్మ, స్టూడెంట్ పాత్రలు బాగానే అనిపిస్తాయి.

టైటిల్‌ :గాండీవధారి అర్జున
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ తదితరులు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం:ప్రవీణ్ సత్తారు
సంగీతం: మిక్కీ జే మేయర్

చివరిగా: ఫలించని కొత్త ప్రయోగం

Recent Articles English

Gallery

Recent Articles Telugu