జోరుమీదున్న గోపీచంద్‌

హీరో గోపీచంద్‌ మరో రెండు రోజుల్లో ‘చాణక్య’ సినిమాతో థియేటర్లలో కలవనున్నాడు. అయితే చాణక్య విడుదలకు సిద్దంగా ఉన్న సమయంలోనే మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు గోపీచంద్‌.

తాజాగా గోపీచంద్‌ తన 28వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సంపత్‌ నందికి ఇచ్చిన విషయం తెలిసిందే. ‘గౌతమ్‌నందా’తో నిరుత్సాహపరిచినప్పటికీ ఈ సారి బలమైన స్క్రిప్ట్‌తో రావడంతో సంపత్‌ నందికి ఈ యాక్షన్‌ హీరో‌ మరోసారి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తొలి క్లాప్‌ కొట్టడంతో షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ “ప్రొడక్షన్ నెం.3” గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో కొత్త దర్శకుడు బిను సుబ్రమణ్యం డైరెక్షన్‌లో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.