ఇండస్ట్రీ ఏ ఒక్కరిదో కాదు: ఆర్.నారాయణమూర్తి!

పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌’. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మించిన హెడ్ కానిస్టేబుల్ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో….

చిత్ర ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ”సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నాం” అన్నారు.

అజయ్ మాట్లాడుతూ.. ”డ‌బ్బు అనేదే లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాలో చూపించాం. ఏదైనా మెసెజ్ ను ఫ్యామిలీ డ్రామాతో క‌లిపి చెబితే జ‌నాల్లోకి వెళుతుంది.100% ఈ సినిమా హిట్ అవుతుంది” అన్నారు.

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ.. ”నేను 30 సంవ‌త్స‌రాలుగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. మా గురించి సినిమా తీయండి అని పోలీసులు అడుగుతుండేవారు. నాకు పోలీసులు అంటే కోపం లేదు. నా కోపం అంతా వ్య‌వ‌స్ధ మీదే అని చెప్పేవాడిని. మాన‌వ విలువ‌ల‌ను ఆర్ధిక విలువ‌లు డామినేట్ చేస్తున్నాయి. ఈ ద‌శ‌లో డ‌బ్బు లేకుండానే చేస్తే బాగుంటుంది క‌దా అనే ఆలోచ‌న మా డైరెక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు చెప్పారు. పాయింట్ న‌చ్చ‌డం.. దీనికి తోడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు గారితో ఎప్ప‌టి నుంచో అనుబంధం ఉండ‌డం వ‌ల‌న ఈ సినిమా చేసాను. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న నా సినిమా రిలీజ్ అవుతుందంటే.. మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ మ‌ధ్య‌లో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్ల‌తో నాకు పోటీ లేదు. అయితే.. నా సినిమాకి ఒక థియేట‌ర్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఒక థియేట‌ర్ కూడా దొర‌క‌డం లేదు అంటే ఏడుపు వ‌స్తుంది. కొంత మంది చేతుల్లో థియేట‌ర్స్ ఉండడ‌డం వ‌ల‌న ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. చిన్న సినిమాకి ధియేట‌ర్స్ దొర‌కక‌పోవ‌డం అంటే దుర్మార్గం చ‌ర్య‌. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ ల‌భించేలా చూడాల్సిన బాధ్య‌త ఫిల్మ్ ఛాంబ‌ర్, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్, గ‌వ‌ర్న‌మెంట్ పై ఉంది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవ‌డం కోసం ఒకే సినిమాని అన్ని థియేట‌ర్స్ లో వేస్తున్నారు. చిన్న సినిమాలు పండ‌గ లేన‌ప్పుడు, పెద్ద సినిమాలు లేన‌ప్పుడు రిలీజ్ చేయాలా..? స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది జ‌నం నిర్ణ‌యిస్తారు. ఇండ‌స్ట్రీ ఏ ఒక్క‌రిదో కాదు.. అంద‌రిది. చిన్న సినిమాల‌కు న్యాయం చేయ‌మ‌ని కోరుతున్నాను” అన్నారు.