డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. ఇసుక వారోత్సవాలను నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం 5 నెలల సమయం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ పేరిట ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించారు. ఈ శిబిరాల ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఆహారం అందించనున్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆహారం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థను ప్రక్షాలను చేసేందుకు తీసుకొచ్చిన విధానాలు 50 మందిని బలిగొంటాయా? అని ప్రశ్నించారు. ‘సమస్యలపై మాట్లాడటం వేరు.. వాటికి పరిష్కారం చూపడం వేరు’ అని ఆయన అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌.. సగటు మనిషి సమాజంలో నిలబడాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కార్మికులకు ఒకపూట భోజనంతో పెద్దగా ఏం కాకపోవచ్చని, కానీ, వారికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాలను ప్రారంభించానని వివరించారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పవన్ కోరారు. ‘ ప్రజలను చంపేస్తుంటే మేం మౌనంగా ఉండిపోవాలా? వైసీపీకు 151 సీట్లు ఇచ్చినందుకు ఇలా చేస్తారా? కొత్త పాలసీ పేరుతో ఇబ్బందులు పెడతారా? వైసీపీ నాయకులకు ఆకలిబాధలు తెలుసా?’ అని పవన్‌ ఘాటుగా ప్రశ్నించారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించారని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని పవన్‌ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షనేత చంద్రబాబుపై కోపంతో నిర్మాణాలు ఆపేస్తారా? అని పవన్‌ దుయ్యబట్టారు. రాజధాని పెద్దదిగా అయిపోతోందని భావిస్తే పరిమాణం తగ్గించాలని కోరారు. 30 వేల ఎకరాల్లో కాకుండా 5 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలని సూచించారు. రాజధానిపై ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని హితవు పలికారు.

పులివెందులలో పెట్టాలనుకుంటే.. ప్రజామోదంతో అదైనా చేయాలని పవన్‌కళ్యాణ్‌ విమర్శించారు. ‘ నేను మాట్లాడితే శాపనార్దాలు పెడతానని అంటున్నారు. వైసీపీ నేతలకు భోజనం లేకుంటే ఉంటారా? కార్మికులు 50 మంది చనిపోతే మాట్లాడకుండా ఉండాలా?’ అని పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్లే పార్టీలో ఉంటారని, ఇష్టం లేనివాళ్లు వెళ్తారని పవన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించిన తర్వాత పవన్‌కళ్యాణ్‌ ఢిల్లీకి పయనమయ్యారు. పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు పలు రాజకీయ అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.