ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: అంజలి

నటి అంజలి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అంటోంది. కట్రదు తమిళ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన పదహారణాల తెలుగు చిన్నది ఈ అమ్మడు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అంజలి చాలా బిజీగా ఉంది. విజయ్‌సేతుపతితో సింధుబాద్, శశికుమార్‌కు జంటగా నాడోడిగళ్‌–2 చిత్రాలతో పాటు కాన్బదు పొయ్, ఓ, శీనూరామసామి దర్శకత్వంలో అరుళ్‌నిధికి జంటగా ఒక చిత్రం, అనుష్క, మాధవన్‌లతో కలిసి సైలెన్స్‌ మొదలగు చిత్రాలలో నటిస్తోంది. వీటితో పాటు తాజాగా అరణ్మణై 3 లో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించిందని సమాచారం. ఇకపోతే తెలుగులోనూ గీతాంజలి–2, ఆనందభైరవి చిత్రాల్లో నటిస్తోంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన సింధుబాద్‌ చిత్రం శుక్రవారం తెరపైకి రావలసిఉండగా అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు.

ఇకపోతే ఇటీవలే 33వ పుట్టిన రోజును అమెరికాలో జరుపుకున్న అంజలి అక్కడ స్కై డైవింగ్‌ చేసి తన జీవితంలో మధుర క్షణమిదని ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ బ్యూటీ ఒక భేటీలో తన మనసులోని భావాలను పంచుకుంది. అవేంటో చూద్దాం. నటుడు విజయ్‌సేతుపతితో తొలిసారిగా నటించిన చిత్రం సింధుబాద్‌. ఆయన ఒక్కోక చిత్రంలో తనను కొత్తగా చూపించుకోవడానికి ప్రయత్నించే నటుడు. సింధుబాద్‌ చిత్రంలో తన కొడుకు సూర్యను కూడా పరిచయం చేశారు. చిత్రంలో విజయ్‌సేతుపతి భార్యనైన నన్ను కిడ్నాప్‌ చేసిన దుండగుల నుంచి ఆయన ఎలా కాపాడడన్నదే కథ. కాగా ప్రస్తుతం చేస్తున్నవన్నీ వైవిధ్యభరిత పాత్రలే. తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలా మంది బాలీవుడ్‌ గురించి అడుగుతున్నారు. నాకలాంటి ఆశ లేదు. తమిళం, తెలుగు అంటూ తెలిసిన నటులతోనే నటించడానికి ఇష్టపడుతున్నాను. అదేవిధంగా నాకు రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆసక్తి లేదు. తెలిసిన పనే చేయాలన్నది నా భావన. ఇకపోతే అందరూ అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు అని. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనేనని స్పష్టంగా తన అభిప్రాయాలను అంజలి వ్యక్తం చేసింది.