నిర్మాతగా మారనున్న కాజల్‌.. తొలి ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..

పన్నెండేళ్లుగా ఇండ‌స్ట్రీలో వెలుగును వెదజలుతున్న ‘చందమామ’ కాజ‌ల్‌ ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌నపై త‌ప్ప మ‌రోదానిపై దృష్టే పెట్ట‌లేదు. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాల‌తోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ‌కు మ‌రో ఆశ కూడా పుట్టింది. ఎక్క‌డ సంపాదించిందో అక్క‌డే పెట్టాల‌ని ఫిక్సైపోయింది‌. అందుకే ఇప్పుడు నిర్మాత అవ‌తారం ఎత్త‌బోతుంది కాజ‌ల్. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపిస్తుంది కానీ ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండి నిర్మాణం ఎలా చేయాలో బాగానే నేర్చేసుకుంది ఈ అమ్మడు.

పైగా అమ్మ‌డు మంచి బిజినెస్ ఉమెన్ కూడా. జ్యూవెల‌రీ బిజినెస్ తో పాటు షూస్ కంపెనీ కూడా కాజ‌ల్ పేరు మీద ఉంది. చెల్లి నిషా అగ‌ర్వాల్ ఇవ‌న్నీ చూసుకుంటుంది. ఇక ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతున్న కాజ‌ల్ KA వెంచర్ పేరుతో ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను మొద‌లుపెడుతుంది.

తొలి సినిమాను ‘అ’.. లాంటి విభిన్నమైన చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ప్లాన్ చేస్తుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ప్ర‌స్తుతం ‘క్వీన్’ త‌మిళ రీమేక్ ‘పారిస్ పారిస్’ సినిమాతో పాటు క‌మ‌ల్ హాస‌న్ ‘భార‌తీయుడు 2’లో న‌టిస్తూ బిజీగా ఉంది కాజ‌ల్. మ‌రి హీరోయిన్ గా సూప‌ర్ స్టార్ అయిన కాజ‌ల్.. నిర్మాత‌గా ఏం చేస్తుందో చూడాలి.