ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఆగమేఘాల మీద భర్తీ చేస్తాం: కేసీఆర్‌

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఈసీ గెజిట్‌ జారీ చేయాల్సి ఉందని, ఆ తర్వాతే నూతన ప్రభుత్వం కొలువుదీరుతుందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారు. రేపు తాను ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని.. అయితే అది ఇంకా ఖరారు కాలేదన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష భేటీకి కేసీఆర్‌ హాజరయ్యారు. టీర్‌ఎస్‌ తరఫున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులంతా కేసీఆర్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను ఎన్నుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన‌ మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇళ్ల స్థలాల అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ వివరించారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజు తనతో పాటు కొంతమంది మంత్రులు, ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలో మరికొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.

దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు అవసరముందని ఈ సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీలూ దొందూ దొందేనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ప్రభుత్వాల ఫ్యూడల్ వైఖరి నశించనంత వరకూ దేశంలో సమూల మార్పులు రావని.. అలా జరగాలంటే ధైర్యం, సాహసం అవసరమన్నారు. ఆ సాహసాన్ని తాను చేస్తున్నాని.. ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తానని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘వందకు వందశాతం మేనిఫెస్టో అమలు చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమే. యువతలో అపోహలు సృష్టించే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. రైతుబంధు పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ అమలు చేశాం. కొద్దిపాటి భూమి ఉన్న రైతు చనిపోయినా రైతుబీమా వర్తింపజేస్తున్నాం. దీంతో చాలా కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. రైతుబీమా.. నాకు తృప్తినిచ్చే పథకం. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా.. రాష్ట్రాభివృద్ధి, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే మాకు ప్రజల్లో ఆదరణ లభించింది. కల్యాణలక్ష్మి పథకంతో తెలంగాణలో దాదాపుగా బాల్య వివాహాలు ఆగిపోయాయి. కేసీఆర్‌ కిట్‌తో ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య కోటి దాటింది’ అని కేసీఆర్‌ చెప్పారు.

‘న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తాం. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తా. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం. ఏడాదిన్నరలో సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు. అబద్ధాలతో యువతను మోసం చేశారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే ఆగమేఘాల మీద భర్తీ చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.