ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టంచేశారు. ఏపీలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కేసీఆర్‌ తన కింద పనిచేశారని చంద్రబాబు అనడం ఆయన అహంభావానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పడు అప్పటి సీఎంల కింద పనిచేశారా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం పచ్చి అవకాశవాది అని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరబోమని చంద్రబాబు గట్టిగా చెప్పలేరన్నారు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమేనని, గతంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారని గుర్తుచేశారు. మోడీ, రాహుల్‌ సైతం ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతూ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్‌ తెలంగాణలో ప్రచారం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరంలేదన్నారు. కొన్ని జాతీయ పార్టీల కంటే టీఆర్‌ఎస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.