HomeTelugu Newsఅక్టోబరు 1 నుంచి సర్కారీ మద్యం దుకాణాలు

అక్టోబరు 1 నుంచి సర్కారీ మద్యం దుకాణాలు

10 16ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి…దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటివరకూ పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేధం అమల్లో భాగంగా…ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించనుంది. అందుకు వీలు కల్పించేలా చట్టాన్ని సవరించనుంది. ఆ దిశగా రూపొందించిన ముసాయిదా సవరణ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండవు.

గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా దాదాపు రూ.2,500 కోట్ల మేర అధిక ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ప్రస్తుతమున్న మద్యం ధరలను పెంచటం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం ధర అధికంగా ఉంటే తాగేవారి సంఖ్య బాగా తగ్గుతుందని ఎక్సైజ్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఆదాయం తగ్గినా ఫరవాలేదు కానీ వినియోగం తగ్గించేదిశగానే చర్యలు ఉండాలని ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారులకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది.

ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించటం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయాన్ని (2017-19 సంవత్సరానికి రూ.500 కోట్లు వచ్చింది) ప్రభుత్వం కోల్పోతుంది. అదే సమయంలో లైసెన్సుదారులకు కమీషన్‌ రూపంలో చెల్లించే మొత్తం ప్రభుత్వానికి మిగులుతుంది. దుకాణాల లైసెన్సుదారులకు వారు చేసే వ్యాపారంపై 10 శాతం కమీషన్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏడాదికి సగటున దాదాపు రూ.20 వేల కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతాయి. కమీషన్‌ రూపంలో వ్యాపారులకు రూ.2 వేలు కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ సొమ్ము ప్రభుత్వానికి మిగులుతుంది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తే ఒక్కో దుకాణానికి నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఈ ఖర్చులన్నీ పోనూ ప్రభుత్వానికి ఆదాయం బాగానే ఉంటుందని ఎక్సైజ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu