సమంత, చైతన్యల మజిలీ రెండో పాట విన్నారా..!

సమంత, చైతన్య జంటగా నటిస్తున్న సినిమా “మజిలీ”. ఈ సినిమాకు సంబంధించిన పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. “వన్‌ బాయ్‌ వన్‌ గర్ల్‌ లుకింగ్, హైటు‌ వైటు చెకింగు..” అంటూ విడుదలైన పాటకు మంచి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. దీన్ని చై, సామ్‌లపై చిత్రీకరించారు. “ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా.. నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ.. నీ వెంట ఉంటా కడదాకా..” అంటూ సాగే ఈ పాటను చిన్మయి ఆలపించారు. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. పాట లింక్‌ను సమంత ట్విటర్‌లో షేర్‌ చేశారు. “చిన్మయి నీ స్వరంలో మ్యాజిక్‌ ఉంది” అని మెచ్చుకున్నారు.

ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకుడు. షైన్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, రాజశ్రీ నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత చై, సామ్‌ జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా హక్కులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది.