HomeTelugu Reviews'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రివ్యూ

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రివ్యూ

Miss Shetty Mr Polishetty Movie Review

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యువి క్రియేషన్స్ బేనర్లో యువ దర్శకుడు మహేష్ బాబు రూపొందించిన ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. ఈ క్రమంలో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

అన్విత (అనుష్క శెట్టి) యూకేలో ఒక పెద్ద హోటల్లో మాస్టర్ చెఫ్ గా పని చేస్తుంటుంది. పెళ్లి పట్ల సదభిప్రాయం లేని ఆమె ఒంటరిగానే ఉండిపోవాలనుకుంటుంది. కానీ క్యాన్సర్ తో పోరాడుతూ చివరి రోజుల్లో ఉన్న అన్విత తల్లి మాత్రం తన కూతురికి ఒక తోడు అవసరమని అనుకుంటుంది. తల్లి మరణానంతరం అన్వితకు కూడా తనకో తోడు అవసరమనే భావన కలుగుతుంది. అందుకోసం పెళ్లి చేసుకోకుండా.. ఒక బిడ్డకు తల్లి కావాలని అనుకుంటుంది. అందుకోసం స్పెర్మ్ డోనర్ కోసం చూస్తున్న ఆమె దృష్టి.. స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధు (నవీన్ పొలిశెట్టి) మీద పడుతుంది. అతడికి విషయం చెప్పకుండా ముందు తనెలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. అన్వితతో ప్రేమలో పడతాడు సిద్ధు. ఇంతలో అన్విత అసలు విషయం చెబుతుంది. అప్పుడు సిద్ధు ఎలా స్పందించాడు.. అన్విత కోరుకున్నది జరిగిందా.. ఇద్దరి మధ్య బంధం చివరికి ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

దర్శకుడు మహేష్ బాబు కామెడీకి మంచి స్కోప్ ఉన్న ఒక పాయింట్ చుట్టూ కథను రాసుకున్నాడు. మిగతా క్యారెక్టర్ల సంగతి పక్కన పెడితే.. నవీన్ పొలిశెట్టి పాత్ర మాత్రం అదిరిపోయింది. నవీన్ కూడా చెలరేగిపోయాడు. వేరే ఆకర్షణలు కూడా కొన్ని ఉన్నా.. సినిమాను డ్రైవ్ చేసేది మాత్రం నవీనే. అతడికి కనెక్టయితే రెండున్నర గంటల పాటు హాయిగా గడిచిపోతాయి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.. బాలీవుడ్ మూవీ ‘విక్కీ డోనర్’ను గుర్తు చేసే అడల్ట్ టచ్ ఉన్న కథ. ప్రేమ, పెళ్లి మీద నమ్మకం లేని ఒక అమ్మాయి.. వీర్య దాత సాయంతో తల్లి కావాలనుకుంటుంది. అందుకోసం మామూలుగా అయితే మంచి జీన్స్ ఉన్న స్పెర్మ్ డోనర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. కానీ శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. గుణగణాలు కూడా బాగుండాలని ఆలోచిస్తూ అలాంటి ఒక వ్యక్తి కోసం సాగించే అన్వేషణ. ఆ క్రమంలో తనకు పరిచయం అయ్యే ఒక స్టాండప్ కమెడియన్.. తనతో జర్నీ.. ఈ క్రమంలో సాగే కథ ఇది.

Miss Shetty Mr. Polishetty

తనకు వీర్యాన్ని దానం చేసే వ్యక్తితో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉండకూడదని అని కోరుకుంటూనే అతడి గుణగణాల్ని ఎంచి ఉత్తముడు అనుకున్నాక తన సాయంతో బిడ్డను కనడం ద్వారా.. అతడితో తెలియకుండానే తాను ఎమోషనల్ గా కనెక్ట్ కావడం.. దీని చుట్టూ సంఘర్షణను హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఐతే డైరెక్టర్ పూర్తిగా హీరోయిన్ కోణంలోనే కథను మొదలుపెట్టి.. ఆమె కోణంలోనే దీన్ని ముగించినప్పటికీ.. మధ్యలో ఆ కథ మధ్యలో ఎంటర్ అయినప్పటికీ దాన్ని డ్రైవ్ చేసేది మాత్రం హీరోనే. నిజంగా స్టాండప్ కామెడీలో ఇంత మజా ఉంటుందా అనిపించేలా ఆ పాత్రను అతను పండించాడు. నవీన్ కథలోకి ఎంటరైన దగ్గర్నుంచి కామెడీ పంచులు పేలుతూనే ఉంటాయి. కథనం మంచి జోష్ తో సాగిపోతుంది. హీరోయిన్ ఉద్దేశం తెలియకుండా ఆమె తన పట్ల చూపించే ఆసక్తిని ప్రేమ అనుకుని హీరో గాల్లో తేలిపోతున్నంత వరకు సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది.

చివరికి అసలు విషయం తెలిసిన తరువాత ట్విస్ట్ కూడా బాగా డీల్ చేశాడు. ద్వితీయార్ధంలో వినోదం తగ్గి.. సీరియస్ గా కథను డీల్ చేసినప్పటి నుంచి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నెమ్మదిస్తుంది. మధ్య మధ్యలో నవీన్ ఎంటర్టైన్ చేసినా కూడా కథనంలో పెద్దగా కదలిక కనిపించదు. ఐతే చివర్లో ఎమోషనల్ టర్న్ తీసుకున్న సినిమా.. ప్రేక్షకులను కదిలిస్తుంది. ముగింపులో భావోద్వేగాలు సరిగా పండడంతో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి వస్తాం. అడల్ట్ టచ్ ఉన్న పాయింట్.. అందుకు తగ్గట్లుగా సాగే కొన్ని సన్నివేశాల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడొచ్చు కానీ.. యూత్ కు అయితే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ బాగా నచ్చుతుంది.

నవీన్ పొలిశెట్టిని కామెడీ చాలా బాగుంది. ఒక సగటు కుర్రాడిని చూస్తున్న ఫీలింగ్ కలిగేలా తన పాత్రను అద్భుతంగా పోషించాడు నవీన్. అనుష్కను అతను బాగా డామినేట్ చేశాడు. అనుష్క నటన పాత్రకు తగ్గట్లుగా సాగింది. లుక్స్ పరంగా అనుష్క మెప్పించలేకపోయింది. నాజర్, మురళీ శర్మ, తులసి, జయసుధ, వీళ్లందరి స్క్రీన్ టైం తక్కువైనప్పటికీ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. హీరో ఫ్రెండు పాత్రలో అభినవ్ గోమఠం హీరోయిన్ స్నేహితురాలిగా సోనియా బాగా చేశారు. నీరవ్ షా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మహేష్ బాబు రచయితగా.. దర్శకుడిగా తన పనితనం చూపించాడు.

 

టైటిల్‌ :’మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’
నటీనటులు: అనుష్క, నవీన్ పొలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమఠం,
నాజర్ తదితరులు
నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి-వంశీకృష్ణారెడ్డి
దర్శకత్వం:మహేష్ బాబు
సంగీతం: రధన్

చివరిగా: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నవీన్ వన్‌ మెన్‌షో

Recent Articles English

Gallery

Recent Articles Telugu