స్పందించిన నయనతార.. మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే

ప్రముఖ తమిళ నటుడు రాధారవి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎట్టకేలకు నయనతార స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికే చప్పట్లు, అభినందనలు లభిస్తుండడం చూసి నాకు ఇప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నంత వరకూ రాధారవి లాంటి వారు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. నాకు వృత్తిపరంగా దేవుడు ఎన్నో మంచి అవకాశాలు ఇస్తున్నాడు. తమిళనాడు ప్రజలు నా పనిని గుర్తించి నాకు మద్దతుగా నిలిచారు. నాపై ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ నేను సీత, దెయ్యం, దేవత, స్నేహితురాలు, భార్య, ప్రేయసి తదితర పాత్రల్లో నటిస్తూనే ఉంటాను. కేవలం నా అభిమానులకు వినోదం పంచేందుకే నేను ఇలాంటి పాత్రలు చేస్తాను. నడిగర్‌ సంఘానికి నాదో విన్నపం. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం సంఘంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటుచేస్తారా? నేను ఇలాంటి ప్రెస్‌నోట్లు విడుదల చేయడం చాలా తక్కువ. ఎందుకంటే నా పనే నేనేంటో చెప్తుందన్నది నా అభిప్రాయం. కానీ ఇటువంటి అంశాలు బయటికి వచ్చి స్పందించేలా చేస్తాయి.’

‘ముందుగా నేను డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన వెంటనే స్పందించి రాధారవిలాంటి వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. చివరగా రాధారవికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మగతనం అనుకుంటారు. ఇలాంటి మగవారి మధ్య బతుకుతున్న ఆడవాళ్లను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. రాధారవి యువతకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి. కానీ ఆయన నీచమైన వ్యక్తులకు ఉదాహరణగా నిలుస్తున్నారు. చేతిలో సినిమాల్లేక ఏం చేయాలో తెలీని పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు’ అని వెల్లడించారు నయనతార‌.