
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ నెలలోనే రాఘవ్-పరిణీతిల పెళ్లి. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రాజస్థాన్ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు దాదాపు 200 మందికిపైగా అతిథులు, 50 మందికిపైగా వీవీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం.
చాలారోజులు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. ఓ హోటల్ డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఇప్పుడు పెళ్లిబంధంతో ఒకటికాబోతున్నారు.













