పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. రెండు సభలు రద్దు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్‌ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకొని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో రోడ్‌షో, బహిరంగ సభలకు నేతలు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న నేపథ్యంలో శ్రేణులను నిరుత్సాహానికి గురిచేయకుండా సభావేదిక వద్దకు బయల్దేరేందుకు సిద్ధమైన పవన్‌ను వైద్యులు వద్దని వారించినట్టు సమాచారం. దీంతో ఆ రెండు సభలను రద్దుచేసినట్టు పార్టీ నేతలు తెలిపారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనున్న నేపథ్యంలో పవన్‌ అస్వస్థతకు గురికావడం జనసేన పార్టీ శ్రేణుల్ని కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates