మా జనసైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు: పవన్‌

అనంతపురంలో జరిగిన జనసేన కవాతులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. ధైర్యమనే గాండీవంతో ఈ కుళ్లు రాజకీయ వ్యవస్థను కడిగేందుకు జనసేన పార్టీ పెట్టానని, అలాంటి తాను ప్రధాని మోడీకి భయపడి, ఆయనకు వత్తాసు పలుకుతున్నానని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పవన్‌ తీవ్రంగా ఖండించారు.తాను ఏ రోజూ బీజేపీకి భయపడలేదని, మొదటిరోజు నుంచి మోడీని ఎదిరించి మాట్లాడింది తానేనని అన్నారు.

‘భయానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. పరిస్థితులకు భయపడి పారిపోవడం. లేదా, అధః పాతాళానికి వెళ్లిపోతామని భయపడుతూనే ముందుకు సాగడం. రెండో దారిలో వెళ్తే రాకెట్‌లా పైకి ఎగరగలం. మనది రెండో దారి. ఆంధ్రులను దోపిడీదారులుగా చిత్రీకరిస్తుంటే అందరూ చూస్తూ కూర్చొన్నారు. పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలవలేని వ్యక్తిని పంచాయతీరాజ్‌శాఖ మంత్రిని చేసిన వ్యవస్థ మనది. నేను సీఎం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆంధ్రా, తెలంగాణ అని చెప్పి వారి అధికారాల కోసం మనల్ని బలి పశువులను చేస్తుంటే బాధేసింది. అవినీతిలేని సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురావాలని అనుకున్నా. 2009లో ఒక బలమైన మార్పు జరుగుతుందని ఆశించాం. కానీ, కేవలం ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది. సీఎం చంద్రబాబు గానీ, అసెంబ్లీ నుంచి పారిపోయిన జగన్‌ గానీ ఆదుకోలేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకుని వచ్చి, ఇప్పుడు అక్కడికే వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రశ్నించాల్సిన జగన్‌ తల నిమరడాలు, బుగ్గలు గిల్లడాలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోలేదు. ఏదైనా మాట్లాడితే, వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. మా జనసైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు. బొత్స సత్యనారాయణ నోరు పారేసుకోవడం మంచిది కాదు. చంద్రబాబుగారే మా వద్దకు వచ్చి జనసేన మద్దతు కావాలని అడిగారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఉద్యమాలు రాకుండా చూడాలని, రాజధాని కోసం అడ్డగోలుగా భూసేకరణ చేపట్ట వద్దని కోరా. కానీ, ఏవీ పట్టించుకోలేదు. రాజధాని కోసం 56వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకున్నారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఆపింది కేవలం జనసేన మాత్రమే. పాపాలు చేసిన వాళ్లకే భయం ఉంటుంది. అలాంటి వారే ఇప్పుడు భయపడుతున్నారు.’ అని పవన్‌ అన్నారు.