10 వేల మంది యువ రైతుల్ని తయారు చేస్తా: పవన్ కల్యాణ్


అనంతపురం జిల్లా నుంచే 10 వేల మంది యువ రైతుల్ని తయారు చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్‌ వెళ్లినప్పుడు వ్యవసాయంపై అక్కడ స్ఫూర్తి పొందానని.. ఇక్కడి కంటే దారుణమైన నేల అక్కడ ఉంటుందని చెప్పారు. అక్కడ ఉన్న నీళ్లతోనే విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో పంట పండిస్తున్నాని పవన్ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెడుతోందని ఆరోపించారు. రైతులకు భూములిచ్చి టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసేందుకు తోడ్పడతానని పవన్‌ హామీ ఇచ్చారు.

తాను దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తినని ఓ కానిస్టేబుల్‌ కుమారుడినని తెలిపారు. ఎలాంటి పదవీ లేకుండా పదేళ్లు పని చేశానని పవన్ అన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించే ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ తరహాలో పంటలు పండిస్తామని.. గాలిలో ఉండే తేమను ఆధారంగా చేసుకొని సాంకేతికతతో అద్భుతంగా పంటలు పండించవచ్చుని అన్నారు. యువ పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు అందించేందుకు బ్యాంకు ఏర్పాటు చేస్తామని అన్నారు. హ్యండ్లూమ్‌ జోన్‌లో అతి తక్కువ వడ్డీకి రుణాలిచ్చి చేనేత కార్మికులకు అండగా ఉంటాం. ఇళ్లు లేని చేనేత కార్మికులకు ఇల్లు కట్టిస్తాం. చేనేత ముడి సరుకుపై 50 శాతం సబ్సిడీ అందిస్తాం. మగ్గాలు లేని వారికి మగ్గాలు అందిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.