Homeతెలుగు Newsవ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు

వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు

8 22గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో ‘జనసేన శంఖారావం’ పేరిట నిర్వహించిన సభలో పవన్‌ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేవలం అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేతన పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆ కోరికే ఉంటే ఎప్పుడో ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుడేవాడినని చెప్పారు. వ్యవస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలనే బలమైన సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అమరావతిలో జనసేన జెండా పాతి తీరుతాం అని స్పష్టం చేశారు. జనసేనను అణచివేయడానికి ఎన్ని వ్యూహాలు వేసినా ప్రతి వ్యూహాలు తానూ వేస్తానని చెప్పారు. ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేద్దాం గానీ.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాలపై కలిసి పోరాటం చేద్దామని టీడీపీ, వైసీపీ కి పిలుపునిచ్చారు.

‘అవినీతి రాజకీయాలతో విసిగిపోయాం. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. అందుకే జనసేన పార్టీని స్థాపించా. ఎప్పటికైనా రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అప్పట్లో పెట్టా. నా దగ్గర డబ్బుల్లేవు. ప్రజాదరణ ఉంది. ప్రాణాలకు తెగించి పోరాడే సత్తా ఉంది. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా’

వచ్చే 30 ఏళ్లపాటు తానే సీఎంగా ఉండాలని జగన్‌ అనుకుంటున్నారు. చంద్రబాబు కూడా మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత తన కుమారుడు అధికారం చేపట్టాలని చూస్తున్నారు. వీరెవరూ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పట్టించుకోవడం లేదు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా. కేవలం అధికారం కోసం రాలేదు. ఆ కోరికే ఉంటే 2009లోనే ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుండేవాడిని. వ్యవస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలనే బలమైన సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చా.

‘ఇటీవల తెలంగాణకు చెందిన నేతలతో నేను మాట్లాడితే ఏవోవో మాట్లాడుతున్నారు. నాకు పోరాటం చేసే వాళ్లన్నా.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులన్నా గౌరవం. అంతే తప్ప ఏ రోజూ కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ రాజకీయ క్షేత్రంలో ఎవ్వరూ మనల్ని ఎదగనివ్వరు. జనసేనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వ్యూహాలు వేస్తారో వేసుకోండి. అందుకు ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు. ఒక మహిళ బయటకు వెళితే ఇంట్లో వాళ్లు ఆమెకు భద్రత ఉందని భావించే రోజు రావాలని జనసేన కోరుకుంటోంది. 2019లో జరిగే త్రిముఖ పోరులో జనసేనదే విజయం. నేనేమీ అన్నా హజారేలా జెండా పట్టుకుని అంతా మంచే జరగాలని కోరుకోవడం లేదు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బురదలోకి దిగాల్సిందే. ఒక నాయకుడికి నమస్కారం పెడితే ఆ పార్టీతో కలిసిపోయామని ప్రచారం చేస్తున్నారు. నేనేం చేయాలనుకున్నా అది ప్రజలకు చెప్పే చేస్తా. నేను మీకు అండగా ఉంటా. మీరు నాకు అండగా ఉండండి. నేనూ చదువుకుని వచ్చిన వాడినే. వ్యూహాలను రూపొందించగలను. ఏ అణగారిన వర్గాలను అధికారానికి దూరం చేశారో వారిని అక్కున చేర్చుకుని అమరావతిని స్వాధీన పరుచుకుంటాం. అమరావతిలో జెండా పాతుతాం’ అని పవన్‌ అన్నారు.

‘భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మరిచిపోయింది. చంద్రబాబు గారికి ఆ విషయం ఆరు నెలలకోసారి గుర్తొస్తుంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దామని పిలిస్తే వైసీపీ నాయకులు కలిసి రావడం లేదు. ఎన్నికల్లో కావాలంటే విడిగా పోటీ చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం కోసం కలిసి పనిచేద్దాం. ఢిల్లీ నాయకుల వెన్నులో వణుకుపుట్టేలా కలిసి పోరాడదాం’ అని పవన్‌ పిలుపునిచ్చారు. ఇదే వేదికపై తమ పార్టీ నేతలైన తోట చంద్రశేఖర్‌, నాదెండ్ల మనోహర్‌ పోటీచేసే స్థానాలను ప్రకంటించారు. గుంటూరు నుంచి తోట చంద్రశేఖర్‌, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ పోటీచేస్తారని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu