కుమార్తె సౌందర్య రిసెప్షన్‌లో తలైవా డ్యాన్స్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో తలైవా డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. చెన్నైలో శనివారం ఘనంగా ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తలైవా ‘ముత్తు’ సినిమాలోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ తల్లి లక్ష్మీ రాఘవేంద్ర కూడా సందడి చేశారు. తలైవా డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో సౌందర్య.. సినీ నటుడు విశాకన్‌ వనగమూడిని వివాహమాడబోతున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఈ వేడుకకు లీలా ప్యాలెస్‌ వేదిక కానుంది. ఆ తర్వాత సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు.

నా జీవితంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు వీరే.. వివాహ వేడుక జరగబోతున్న సందర్భంగా వధువు సౌందర్య ట్విటర్‌లో పలు ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘మాటలకు అందనంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు.. నా డార్లింగ్‌ నాన్న, నా ఏంజిల్‌ కుమారుడు వేద్‌, ఇప్పుడు విషగన్‌..’ అని ట్వీట్‌ చేశారు.