సౌందర్య వివాహనికి మొదటి శుభలేఖ అతనికే: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్‌ వనగమూడితో ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో తలైవా సినీ ప్రముఖుల నివాసాలకు వెళ్లి మరీ వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ నటుడు ప్రభు.. రజనీతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వేడుకకు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడైన తిరునవుక్కరాసర్‌కు శుభలేఖను ఇవ్వడానికి వెళ్లారు. ఆయనతో పాటు విడుదలై చిరుత్తగళ్‌ కట్చి పార్టీ అధినేత తిరుమవలవన్‌ కూడా ఉన్నారు.

పెళ్లి గురించి రజనీ తమిళ మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి పెళ్లి నేపథ్యంలో మొదటి ఆహ్వానాన్ని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడైన తిరునవుక్కరాసర్‌కే ఇచ్చాను. ఎందుకంటే సౌందర్య పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అతనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అందుకే మొదటి శుభలేఖ తిరుకు ఇచ్చాను. మరికొందరిని ఆహ్వానించాల్సి ఉంది. నేను ఇప్పుడు ఎవరైతే రాజకీయ నేతలను కలుస్తున్నానో అది కేవలం పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే. దీనికి నా రాజకీయ ప్రయాణానికి ఎలాంటి సంబంధం లేదు’ అని వెల్లడించారు. పెళ్లి అనంతరం ఫిబ్రవరి 12న ఘనంగా వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.