HomeTelugu Reviews'జైలర్' మూవీ రివ్యూ

‘జైలర్’ మూవీ రివ్యూ

Jailer Movie Review

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటించిన చితరం ‘జైలర్’. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరుకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో చూద్దాం..

ముత్తు (రజనీకాంత్) ఆయన భార్య విజయ (రమ్యకృష్ణ) ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ దంపతులు తమ కొడుకు అర్జున్ – కోడలు శ్వేత .. మనవడితో కలిసే ఉంటారు. అర్జున్ ఏసీపీగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన చాలా సిన్సియర్. తప్పు చేసింది ఎంత పెద్దవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కుంటాడు. గతంలో పోలీస్ డిపార్టుమెంటులో పనిచేసిన ముత్తు, తన కొడుకు సిన్సియారిటీ చూసి గర్వపడుతూ ఉంటాడు. రిటైర్ అయిన ఆయన, మనవడితో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.

అలాంటి పరిస్థితుల్లోనే పురాతనమైన దేవాలయాలలోని విగ్రహాలను దొంగిలించే ముఠా ఒకటి రంగంలోకి దిగుతుంది. ప్రాచీన విగ్రహాలను కాజేసి అలాంటి మరో విగ్రహాన్ని అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అయితే మతపరమైన సమస్య కావడం వలన, పోలీస్ డిపార్టుమెంటు ఈ విషయం బయటికి రాకుండా చూస్తూ ఉంటుంది. దేవాలయాల నుంచి దొంగిలించిన విగ్రహాలు ఇతర ప్రాంతాలకు రహస్యంగా తరలించబడుతూ ఉంటాయి. ఈ రాకెట్ వెనుక ప్రధానమైన సూత్రధారి వర్మన్( వినాయకన్).

ఈ కేసును ఛేదించడానికి ఏసీపీ అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఆ కేసు పరిశోధన గురించి వెళ్లిన అతను, వెనక్కి తిరిగిరాడు. ఈ కేసుకు సంబంధించిన వారే తన కొడుకును చంపేశారనే విషయం ముత్తుకు తెలుస్తుంది. చిన్నప్పుడు కొడుకు ‘పన్ను’ ఊడిపోతే ఆ పన్నును పారేయడానికి మనసొప్పక, దానిని ఒక లాకెట్ లో ఉంచి ధరిస్తూ వచ్చిన ముత్తు, ఆ నిజాన్ని తట్టుకోలేకపోతాడు. చిన్నప్పటి నుంచి నీతి – నిజాయతి అంటూ అర్జున్ ను ఆ మార్గంలో నడిపించడం వల్లనే, అతను చనిపోయాడని విజయ తన భర్తను నిందిస్తుంది.

అర్జున్ డెడ్ బాడీ కూడా దొరక్కపోవడంతో, ఆ కేసును పక్కదారి పట్టించడానికి డిపార్టుమెంటులో పెద్ద తలకాయలు ప్రయత్నాలు చేస్తుంటాయి. మరో వైపున ముత్తు మనవడిని చంపుతాననీ, అందులో ఎలాంటి సందేహం లేదని అతనికి వర్మన్ సవాలు విసురుతాడు. ఆ క్షణం నుంచే తన ప్రయత్నాలు మొదలెడతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ముత్తు రంగంలోకి దిగుతాడు. ముత్తు ఓ పోలీస్ ఆఫీసర్ కి తండ్రి మాత్రమే కాదనీ, 15 ఏళ్ల క్రితం కరడుగట్టిన నేరస్థులకు చుక్కలు చూపించిన తీహార్ జైలు జైలర్ అనీ, పూర్తి పేరు ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’ అని వర్మన్ కి తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది కథ.

కోలీవుడ్‌లో డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథను రెడీ చేసుకునే తీరు .. దానిని పెర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించే విధానం ఆసక్తికంగా ఉంటాయి. అదే పద్ధతిలో ఆయన ‘జైలర్’ కాన్సెప్ట్ ను నడిపించాడు. ముందుగా ఆయన విలన్ ను పరిచయం చేసి, ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్ ఇప్పించడం కొత్తగా అనిపిస్తుంది. రజనీ లుక్ ను సెట్ చేసిన తీరుతోనే ఆయన సగం మార్కులు కొట్టేశాడు. రజనీ స్టైల్ ను .. విలన్ మేనరిజంను ఆయన డిజైన్ చేసుకున్న విధానం, ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.

ఫస్టాఫ్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు తల తిప్పనివ్వడు. తెరపై ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ గా యోగిబాబు .. మానసిక వైద్య నిపుణిడిగా వీటీవీ శంకర్ హాయిగా నవ్విస్తారు. ఫస్టాఫ్ లో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇస్తే, సెకండాఫ్ లో జాకీ ష్రాఫ్ .. మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తారు. అయితే వీరి పాత్రలు కావాలని అంటించినట్టుగా కాకుండా, సందర్భానికి తగినట్టుగా అనిపిస్తాయి. వాళ్ల స్థాయికి తగిన పవర్ఫుల్ రోల్స్ లోనే కనిపిస్తారు. సెకండాఫ్ లో సునీల్ – తమన్నా లవ్ ట్రాక్, మెయిన్ థ్రెడ్ తో ముడిపడి ఉంటుంది. సెకండాఫ్ లోనే జైలర్ గా రజనీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది .. రజనీ యంగ్ లుక్ తో ఆ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.

హీరో .. విలన్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రీ క్లైమాక్స్ లో పడే ట్విస్ట్ తో ప్రేక్షకుడు ఉలిక్కిపడతాడు .. ముత్తు పాత్ర విషయంలో ఆందోళన చెందుతాడు. ఈ సందర్భంలో రజనీకాంత్ లోతైన నవ్వు, ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. కొన్ని సన్నీవేశాల్లో తప్పించి.. ఈ సినిమా రజనీకాంత్‌ మార్క్‌ని నెలబెట్టెలా ఉంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఫొటోగ్రఫీ బాగుంది.

టైటిల్‌ : జైలర్‌
నటీనటులు: రజనీకాంత్‌, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు, తదితరులు
నిర్మాతలు: కళానిధి మారన్
దర్శకత్వం:నెల్సన్ దిలీప్ కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్

చివరిగా: రజనీ మార్క్‌ మూవీ

Recent Articles English

Gallery

Recent Articles Telugu