HomeTelugu ReviewsOkka Ammayi Thappa Movie Review

Okka Ammayi Thappa Movie Review

“ఒక్క అమ్మాయి తప్ప” సమీక్ష!

నటీనటులు: 
సందీప్ కిషన్, నిత్యామీనన్, రవికిషన్, అజయ్, నల్ల వేణు, సప్తగిరి తదితరులు..
సాంకేతికవర్గం: 
సంగీతం: మిక్కీ జె.మేయర్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
నిర్మాత: బోగాది అంజిరెడ్డి
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజసింహా తాడినాడ
విడుదల తేది: 10/6/2016 
రేటింగ్: 1.5/5 
Okka Ammayi Thappa
మూడేళ్ళ క్రితం వచ్చిన “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” మినహా ఇప్పటివరకూ మచ్చుకకైనా ఒక్క హిట్టు కూడా లేని సందీప్ కిషన్ అప్పట్నుంచి “విజయం” కోసం వరుస సినిమాలతో దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అతడి దండయాత్రలో భాగంగా నటించిన తాజా చిత్రం “ఒక్క అమ్మాయి తప్ప”. రచయితగా పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన రాజసింహ తాడినాడను దర్శకుడీగా పరిచయం చేస్తూ.. ప్రముఖ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంజిరెడ్డి నిర్మాతగా మారి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా కోసం సందీప్ కిషన్ పారితోషికం తీసుకోకుండా నటించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: 
కృష్ణ (సందీప్ కిషన్) తెలివైన కుర్రాడు. ఎటువంటి సమస్యనైనా కండబలం కాకుండా బుద్ది బలం ఉపయోగించి పరిష్కరించాలనుకుంటాడు. స్కూల్ వయసులోనే తన తోటి క్లాస్ మేట్ మ్యాంగో (నిత్యామీనన్) ను జాతీయ జెండా ఇచ్చి మరీ తన ప్రేమను వ్యక్త పరుస్తాడు. కానీ, కృష్ణ అన్నయ్య పుణ్యమా అని అప్పట్లో ఆ ప్రేమ వర్కవుట్ అవ్వదనుకోండి.
ఆ తరువాత చాలా సంవత్సరాల విరామం అనంతరం అనుకోని విధంగా హైటెక్ సిటీ ఫైల్ ఓవర్ మీద మళ్ళీ ఒకర్నొకరు కలుసుకొంటారు. వీరిద్దరు మధ్య ప్రేమ చిగురిస్తుందనుకొనే సమయంలో.. ఓ పెద్ద యాక్సిడెంట్ అయ్యి.. ఫ్లై ఓవర్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది.
అన్వర్ (రవికిషన్) ప్లాన్ చేసిన ఓ టెర్రరిస్ట్ ఎటాక్ ను కృష్ణ ద్వారా పూర్తి చేయాలనుకొంటాడు.
అసలు అన్వర్ కు కృష్ణ ఎలా దొరుకుతాడు? అతడి టెర్రరిస్ట్ యాక్టివిటీకి కృష్ణ ఎందుకు సహాయపడతాడు?
అసలా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంటి? వంటి ఆసక్తికర అంశాల సమాహారమే “ఒక్క అమ్మాయి తప్ప” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: 
కృష్ణ అనే కుర్రాడి పాత్రలో సందీప్ ఫర్వాలేదనిపించుకొన్నాడు. పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా తెలివిగా అతడు డీల్ చేసే విధానం సగటు ప్రేక్షకుడికి విస్మయాన్ని కలిగిస్తుంది. అయితే.. పతాక సన్నివేశాల్లో మాత్రం హీరోయిజమ్ సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు.
బహుశా నిత్యామీనన్ కెరీర్ లో ఆమె పోషించిన క్యారెక్టర్ అంటూ లేని క్యారెక్టర్ ఇదేనేమో. సినిమా సెకండాఫ్ వరకూ అసలామే ఈ “ఫ్లై ఓవర్” డ్రామాలో ఎందుకు చిక్కుకుందో? అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు. అయినప్పటికీ.. తనదైన హావభావాలతో సన్నివేశాలకు ప్రాణం పోసింది. కాకపోతే.. మరీ లావుగా కనిపించడం ఒక్కటే ఆమె తరపున మైనస్.
టెర్రరిస్ట్ కమ్ పోలీస్ ఆఫీసర్ గా రవికిషన్ తన పాత్ర పరిధిమేరకు ఫర్వాలేదనిపించుకొన్నాడు. కానీ.. సొంత డబ్బింగ్ వలన చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ మిస్ అవుతుంది.
సప్తగిరి, తాగుబోతు రమేష్, 30 ఈయర్స్ పృధ్వీల చేత కామెడీ చేయించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడమే కాక కథను పక్కదారి పట్టించేలా ఉన్నాయి.
గుడ్డిలో మెల్ల అన్నట్లుగా.. అలీ మాత్రం కాస్త ప్రేక్షకుల్లో తన కామెడీతో చలనం తీసుకురాగలిగాడు.
సాంకేతికవర్గం పనితీరు: 
మిక్కీ జె.మేయర్ బాణీలు ఓ రెండు మినహా మిగాతవన్నీ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. అలాగే.. నేపధ్య సంగీతం కూడా హీరోయిజమ్ ఎలివేట్ చేసే సీన్స్ లో మినహా పెద్దగా అలరించలేకపోయింది.
సీనియర్ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు తన సీనియారిటీ మొత్తం రంగరించి సరికొత్త కెమెరా యాంగిల్స్ లో క్యారెక్టర్లను ఎలివేట్ చేద్దామని ప్రయత్నించాడు కానీ అది వృధా ప్రయాసగా మారింది. ముఖ్యంగా టైట్ క్లోజ్ నుంచి ఒక్కసారిగా జూమ్ లెన్స్ సాయంతో తీసిన టైమ్ ల్యాప్స్ షాట్స్ సినిమాకి మైనస్ లుగా మారడమే ఛాయాగ్రాహకుడిగా అతడి పరాజయానికి ప్రత్యక్ష సాక్ష్యం.
సినిమా మొత్తం ఫ్లై ఓవర్ మీదనే నడుస్తుంటుంది. అయితే.. అది ఫ్లై ఓవర్ అనే విషయం లాంగ్ షాట్స్ మినహా ఎక్కడా అనిపించదు. ఇక లారీ యాక్సిడెంట్ సీన్స్ మరీ మొబైల్ గేమ్స్ ను తలపించడం నిర్మాత అంజిరెడ్డి నిర్మాణ విలువలకు అద్ధం పడుతుంది.
Okka Ammayi Thappa review
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: 
రచయితగా “బావగారూ బాగున్నారా, రుద్రమదేవి, సరైనోడు” వంటి సక్సెస్ ఫుల్ సినిమాకు పనిచేసిన రాజసింహ తాడినాడ ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఈ సబ్జెక్ట్ ను రెడీ చేసుకొన్నాడని చెప్పాడు. పేలని పంచ్ డైలాగులు, ఎప్పుడో యూట్యూబ్, వాట్సాప్ లో చూసేసిన ఫన్నీ సీన్లు చూస్తే అది నిజమే అనిపించకమానదు.
కథలో కాస్తంత కొత్తదనం ఉంది, కానీ కథనం మాత్రం చాలా పేలవంగా ఉంది. ఇక దర్శకుడిగా రాజసింహ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. హైద్రాబాద్ కు గుండెకాయ లాంటి హైటెక్ సిటీలోని ఓ ఫ్లైఓవర్ పెద్ద లారీ యాక్సిడెంట్ కారణంగా జామ్ అయిపోతే.. ఒక్కరంటే ఒక్క పోలీస్ కూడా కనీసం అటువైపుకు రాకపోవడం, దాదాపుగా అయిదారు గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయినా.. జనాలు చాలా సరదాగా అక్కడే బండ్ల మీద కూర్చోవడం, కార్లలో పడుకోవడం వంటివి చాలా అసహజంగా అనిపిస్తుంటాయి. “పేద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది” అనే టెన్షన్ అక్కడి జనాల్లో.. థియేటర్లో కూర్చోన్న ప్రేక్షకుల్లో కలిగించలేకపోయాడు దర్శకుడు.
ఇక సందీప్ కిషన్-నిత్యామెన్ ల లవ్ ట్రాక్ ను కూడా సరిగా డిజైన్ చేయలేదు.
విశ్లేషణ: 
కథగా చెప్పుకొంటే “ఒక్క అమ్మాయి తప్ప” ఒక మంచి ప్రయత్నం. టెర్రరిజానికి ప్రేమని జోడించి అల్లిన మంచి కథ. కానీ.. తెరపై మాత్రం ఆ కథ ఎక్కడా కనిపించదు. ఎంతసేపూ హీరో ఫోన్లో మాట్లాడడం, తన తెలివి మొత్తం ఉపయోగించేసి బాంబ్ బ్లాస్ట్ నుంచి నగరాన్ని, కాదు కాదు “ఫ్లై ఓవర్”ను కాపాడడమే సినిమా అన్నట్లుగా ప్రెజంట్ చేశాడు దర్శకుడు.
కథలో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని మాత్రం గాలికొదిలేశాడు. మరి అది నిర్మాత సహకరించకపోవడం వల్ల జరిగిన తప్పో.. లేక దర్శకుడీగా అతడి వైఫల్యమే తెలియదు కానీ.. ప్రేక్షకుడు మాత్రం తీవ్ర అసహనానికి లోనవుతుంటాడు.
మొత్తానికి.. 
కాన్సెప్ట్ బాగుంది కానీ.. ప్రేక్షకుడ్ని ఆకట్టుకోలేని “ఒక్క అమ్మాయి తప్ప” 

Recent Articles English

Gallery

Recent Articles Telugu