రామ్‌చరణ్‌కు గాయం.. షూటింగ్‌ వాయిదా

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెణికి చిన్న గాయమైంది. దాంతో పుణెలో జరగాల్సిన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణను వాయిదా వేశారు. ఆయన మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో షూటింగ్‌ కూడా మూడు వారాల తర్వాతే కొనసాగించనున్నట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

ఇటీవల షూటింగ్‌ నిమిత్తం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ గుజరాత్‌లోని వడోదరకు వెళ్లారు. అక్కడి రోడ్లపై తారక్‌, చరణ్‌ స్కూటీపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. తర్వాతి షెడ్యూల్‌ పుణెలో జరగాల్సి ఉంది. ఇంతలో చరణ్‌కు గాయం కావడంతో షూటింగ్‌ వాయిదా పడింది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఆలియా భట్‌, డైసీ ఎడ్గార్‌జోన్స్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చరణ్‌కు గాయమైన విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన సతీమణి ఉపాసన ఓ ట్వీట్‌ చేశారు. ‘మిస్టర్‌ సి త్వరగా కోలుకోవడానికి మీ ఆశీర్వాదాలు కావాలి’ అని పేర్కొన్నారు.