ఘనంగా రజనీకాంత్‌ కుమార్తె ‘సౌందర్య’ రిసెప్షన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే రిసెప్షన్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపం వేడుకకు వేదికైంది. కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సౌందర్య నీలి, బంగారు వర్ణం పట్టుచీరలో మెరిశారు. కాబోయే దంపతులతోపాటు ఐశ్వర్య, రజనీ, లత వేదికపై ఉన్నారు.

ఫిబ్రవరి 11న చెన్నైలో సౌందర్య, విషగన్‌ వివాహం జరగనున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా సౌందర్య పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 4న ఆమె ట్విటర్‌ వేదికగా పెళ్లి వార్తలు నిజమేనని తెలిపారు. పెళ్లికి ఇంకా వారం ఉందని ట్వీట్‌ చేశారు. ఈ మేరకు తన కుమార్తె పెళ్లికి రజనీ సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులను ఆహ్వానించారు.