వెంకటేష్‌తో త్రివిక్రమ్‌ సినిమా!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను యంగ్‌ టైగర్‌తో చేయాలని భావించాడు. ముందుగా అనుకున్న ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగు పూర్తికాగానే ఆయనతో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. అయితే లాక్ డౌన్ కారణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్స్ మారిపోయాయి. ఆ ప్రభావం ఎన్టీఆర్ తదుపరి సినిమాపై పడింది. త్రివిక్రమ్ తాను అనుకున్న సమయానికి ఎన్టీఆర్ తో ప్రాజెక్టును పట్టాలెక్కించే పరిస్థితి లేకుండా పోయింది.

దాంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగును పూర్తి చేసి ఎన్టీఆర్ వచ్చేలోగా మరో హీరో ప్రాజెక్టును పూర్తి చేయాలనే నిర్ణయానికి త్రివిక్రమ్ వచ్చినట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆ హీరో వెంకటేష్‌ అనేది తాజా సమాచారం. వెంకటేష్‌ తో ఓ సినిమా చేయాలని గతంలోనే త్రివిక్రమ్ అనుకున్నాడు. కథ కూడా ఓకే చేసి వుంది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఆ కథను ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ వున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.