విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలా? : విజయశాంతి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్యార్థుల ఆత్మహత్యలు జరగడం విచారకరమన్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ వరంగల్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. హన్మకొండ ఏకశిలాపార్కు వద్ద విజయశాంతి, మాజీ మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన విజయశాంతి సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విజయశాంతితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయశాంతి మాట్లాడుతూ.. చేయని తప్పులకు విద్యార్ధుల జీవితాలు బలవుతున్నా.. ఈ అంశంపై సమీక్షించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఐదు రోజుల సమయం పట్టిందని దుయ్యబట్టారు. సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత కేసీఆర్‌కు లేదని.. కనీసం అన్యాయానికి గురైన విద్యార్ధులకు భరోసా కూడా ఇవ్వలేకపోయారని ఆమె ధ్వజమెత్తారు. విద్యార్ధులకు న్యాయం జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలిచి ఉద్యమిస్తుందన్నారు.