Homeపొలిటికల్Ys Jagan: అందరూ కలిసి నా ఒక్కడిపై యుద్ధానికి వస్తున్నారంటున్న జగన్‌

Ys Jagan: అందరూ కలిసి నా ఒక్కడిపై యుద్ధానికి వస్తున్నారంటున్న జగన్‌

 

Ys Jagan

Ys Jagan: ఈ రోజు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఈ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అన్నారు. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు ఉన్నాయి… నిజం ఒకవైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి అని వివరించారు.

ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం ఒక వైపున… ప్రతి ఇంటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరో వైపున ఉన్నాయి… మంచి ఓ వైపున, చెడు ఓ వైపున… వెలుగు ఒక వైపున, చీకటి మరో వైపున… ధర్మం ఒకవైపున, అధర్మం మరో వైపున ఉన్నాయి అని తెలిపారు. ఈ రెండు ప్రత్యామ్నాయాల గురించి ప్రతి ఇంట్లోనూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.

అధికారాన్ని ఉపయోగించి ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరిసేలా చేసిన మన ప్రభుత్వం ఒకవైపున ఉంది. గతంలో మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి… వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్టుగా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్లెదుటే కనిపిస్తున్నారు.

ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ అయిన నేను ప్రజల పక్షాన ఉన్నానని చెప్పడానికి గర్విస్తున్నా. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి… ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. కొన్ని వీడియా సంస్థలతో పాటు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ. వీళ్లందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రజల పక్షం… వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ కేవలం నా ఒక్కడిపై యుద్ధానికి వస్తున్నారు.

మే 13న జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మీ బిడ్డకు మీరు తోడుగా నిలవాలి. ఈసారి ఏకంగా 175కి 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25కి 25 లోక్ సభ స్థానాలు గెలిపించుకుని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కారును సాధించేందుకు మీరంతా సిద్ధమేనా? జీవితంలో ప్రతి రోజూ కీలకమే. అలాంటిది మీరు వేసే ఓటుతో ఐదేళ్ల జీవితం ప్రభావితమవుతుంది. మీరు వారికి ఓటేస్తే 1825 రోజులు మీ భవిష్యత్ ను వాళ్ల చేతిలో పెట్టినట్టే.

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే ఒక్క పథకమైనా ఉందా? చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా? కానీ… వార్డు/గ్రామ సచివాలయాలు చూస్తే గుర్తుకొచ్చేది… మీ బిడ్డ జగన్! రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు, ప్రభుత్వ బడులు చూస్తే గుర్తుకొచ్చేది… మీ బిడ్డ జగన్! వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే గుర్తుకొచ్చేది… మీ బిడ్డ జగన్. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది ఎవరంటే గుర్తుకొచ్చేది… మీ బిడ్డ జగన్.

పేదల ఇళ్ల కాలనీలు చూస్తుంటే గుర్తుకువచ్చేది… మీ జగన్. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలోకి డబ్బులు బదిలీ అవుతున్నాయంటే గుర్తుకువచ్చేది ఎవరు… మీ జగన్. మధ్యలో జన్మభూమి కమిటీల వంటి దళారులు లేరు, లంచాలు లేవు, వివక్షకు అసలు చోటే లేదు, నేరుగా బటన్ నొక్కడం, అక్కచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా డబ్బులు వెళ్లడం, అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తుండడం చూస్తుంటే గుర్తుకు వచ్చేది ఎవరు… మీ బిడ్డ జగన్.

మీ బిడ్డ ఇప్పటివరకు 130 సార్లు బటన్ నొక్కి డీబీటీ కింద రూ.2.70 లక్షల కోట్లు విడుదల చేశాడు. ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఫ్యాన్ గుర్తుకు మీ చల్లని దీవెనలు అందించాలని మిమ్మల్నందరినీ ప్రార్థిస్తున్నాను… అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!