ఆ విషయంలో రాజీపడొద్దు: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే శాఖల వారీ సమీక్షకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని తన నివాసంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై తొలి సమీక్ష నిర్వహించారు. అక్షయ పాత్ర ట్రస్ట్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తేవాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గుచూపేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో భోజనం, తాగునీరు, ఇతర వసతులు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వంటశాలలు నిర్మించాలన్నారు. ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేన్న ముఖ్యమంత్రి జగన్‌.. తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధంచేసుకొని రావాలని అధికారులకు సూచించారు.

శనివారం ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించనున్నట్టు సమాచారం. జూన్‌ 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం నుంచి జలవనరుల శాఖ, జూన్‌ 4న ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై.. అదే రోజు మధ్యాహ్నం గృహనిర్మాణం, జూన్‌ 6న సీఆర్డీఏపై జగన్‌ సమీక్షించనున్నారు.

మరోవైపు, జూన్‌ 8న జగన్‌ సచివాలయానికి రానున్నారు. ఉదయం 8.39 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. అదే రోజు మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. సచివాలయం పక్కనున్న స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే మొదటి కేబినెట్‌ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

CLICK HERE!! For the aha Latest Updates