చిన్నారి అభిమానిని చూసి చ‌లించిన రామ్‌!

చిన్నారి అభిమానిని చూసి చ‌లించిన రామ్‌!
 
రామ్ అనే పేరు విన‌గానే అంద‌రికీ అంద‌మైన కుర్రాడి రూపం క‌ళ్ల‌ముందు క‌దులుతుంది. అంత‌క‌న్నా హుషారుగా ఉండే వ్య‌క్తిత్వం గుర్తుకొస్తుంది. కానీ శుక్రవారం విశాఖ వాసుల‌కు మాత్రం అత‌నిలోని మంచి మ‌న‌సు క‌నిపించింది. చిన్నారి బాధ‌ను చూసి చ‌లించిపోయి కంటికింద చెమ్మై చేరిన అత‌ని ఉదార‌త క‌ళ్ల‌ముందు సాక్షాత్కార‌మైంది. వివ‌రాల్లోకెళ్తే… విశాఖ‌ప‌ట్నంలోని ఎంవీపీ కాల‌నీ మూడ‌వ సెక్టార్ నివాసితుల సంక్షేమ సంఘం యువ‌జ‌న అధ్య‌క్షుడు ర‌వికుమార్ రెండో కుమార్తె పేరు కుంద‌న పూర్ణ చంద్రిక‌. ఐదేళ్ల ఈ చిన్నారి తీవ్ర అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతోంది. న‌డుము కింది భాగం చ‌చ్చుగా మార‌డంతో క‌ద‌ల‌లేకుండా ఉంది. ఈ చిన్నారికి హీరో రామ్ అంటే ఇష్టం. రామ్ న‌ట‌న‌, అత‌ను చేసే డ్యాన్సులంటే బాగా ఇష్టం. రామ్‌ని చూడాల‌ని ఆమె గ‌త కొన్నేళ్లుగా మారాం చేయ‌డంతో `శివ‌మ్‌` చిత్రం స‌మ‌యంలో రామ్ వైజాగ్‌కి వెళ్లిన‌ప్పుడు చిన్నారిని తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. ఆ స‌మ‌యంలో  త‌న‌ను ఎత్తుకుని ముద్దాడిన రామ్ అంటే కుంద‌న‌కు అభిమానం మ‌రింత పెరిగింది. మ‌రోసారి రామ్‌ను చూడాల‌ని ఆ చిన్నారి త‌పించిపోసాగింది. దాంతో రామ్‌ను క‌లవ‌డానికి మార్గాల‌ను వెత‌క‌సాగారు ర‌వికుమార్ దంప‌తులు. 
ప్ర‌స్తుతం రామ్ నటిస్తున్న `హైప‌ర్‌` చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జ‌రుగుతోంద‌ని తెలుసుకున్నారు. దాంతో ఆయ‌న్ని క‌లిసి త‌మ కుమార్తె ప‌రిస్థితిని వెల్ల‌డించాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ వారికి స‌రైన దారి తెలియ‌క‌పోవ‌డంతో  కుద‌ర‌లేదు. దాంతో ఆ విష‌యాన్ని ఓ ప‌త్రికకు వివ‌రించి, ఆ ప‌త్రిక  ద్వారా రామ్‌కు తెలియ‌జేశారు. విష‌యాన్ని ప‌త్రిక‌లో చూసి తెలుసుకున్న రామ్ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఆ చిన్నారి ఇంటికి వెళ్లారు. పాప‌తో చాలా సేపు గ‌డిపారు. పాపకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను  అడిగి తెలుసుకున్నారు.  మెడిక‌ల్ రిపోర్టుల‌ను కూడా క్షుణ్ణంగా చూశారు. రామ్‌ని చూడ‌గానే కుంద‌న ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. త‌న అభిమాన హీరో త‌నకోసం త‌న ఇంటికి రావ‌డాన్ని ఆ చిన్నారి చాలా సేపు న‌మ్మ‌లేక‌పోయింది. వెంట‌నే అత‌ని ఒళ్లో కూర్చుని అత‌నంటే త‌న‌కు ఎంత అభిమాన‌మో గుక్క‌తిప్పుకోకుండా చెప్ప‌సాగింది. రామ్ న‌టించిన సినిమాల్లో త‌న‌కు న‌చ్చిన స‌న్నివేశాల‌ను చెబుతూ, పాట‌ల‌ను పాడుతూ సంద‌డి చేసింది. కుంద‌న‌ను చూసిన రామ్‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు. ఆయ‌న కంట‌త‌డిని గ‌మ‌నించిన వారికి కూడా కంట‌త‌డి పెట్టుకున్నారు. కానీ ఆ చిన్నారికి మాత్రం అవేమీ అర్థం కాలేదు. మ‌రోవైపు రామ్‌ను చూడ‌టానికి వ‌చ్చిన‌ చుట్ట‌ప‌క్క‌ల వారితో ఆ ప్రాంతం కిట‌కిట‌లాడింది. 
`నీకు ఏం ఇష్టం` అని రామ్ ఆ చిన్నారిని అడ‌గ్గా `హైప‌ర్‌` షూటింగ్ చూడాల‌ని ఉంద‌ని చెప్పింది. కుంద‌న కుటుంబాన్ని  `హైప‌ర్‌` షూటింగ్‌కు ర‌మ్మ‌ని ఆహ్వానించారు రామ్‌. శ‌నివారం మ‌ధ్యాహ్నం భోజ‌నానికి కూడా ఆహ్వానించారాయ‌న‌.  ప‌సిపాప కోరిక‌ను అర్థం చేసుకున్న రామ్‌కు పాప త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాల‌ను చెప్పుకున్నారు. 
CLICK HERE!! For the aha Latest Updates