HomeTelugu Big StoriesAP Elections 2024: నగరిలో రోజా హ్యాట్రిక్‌ కొడుతుందా?

AP Elections 2024: నగరిలో రోజా హ్యాట్రిక్‌ కొడుతుందా?

Will Roja win again in Naga AP Elections 2024,Roja,ysrcp,nagari

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. మరో 17 రోజుల్లో ఏపీలో అభ్యర్థుల భవిష్యత్తును ప్రజలు నిర్ణయించనున్నారు. అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షంలోని పార్టీల నేతల ప్రచార హోరు మారుమోగిపోతోంది. ఎవరి ప్రయత్నాలువారు చేసుకుంటున్నారు. అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒక్కోసారి వ్యక్తిగత విమర్శలు వరకు వెళ్లిపోతున్నారు. ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం నగరి. రాష్ట్రంలోనే అనేక వివాదాలతో ఫేమస్ అయి నిత్యం వార్తల్లో ఉంటే నియోజకవర్గం ఇది. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో సినీ నటి రోజా, గాలి భానుప్రకాష్ నాయుడు మధ్య పోటీ నెలకొంది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చిన రోజా ఓ వైపు ఉంటే.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి భానుప్రకాష్ నాయుడు మరోవైపు బరిలో ఉన్నారు.

అసెంబ్లీ అయినా, టీవీ లైవ్ షోలో నైనా దడదడలాడించే మంత్రి రోజా ఎన్నికల ప్రచారం అంటే అందరిలో ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ అనుకుంటారు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రోజా ప్రత్యర్థులను తమ డైలాగులతో చీల్చి చెండాడుతుందని అనుకుంటారు. అయితే క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. దీనికి కారణంలో నియోజకవర్గంలో స్థానిక నేతలతో రోజాకు ఉన్న వర్గపోరే కారణమని తెలుస్తోంది. అసమ్మతి నాయకులు తమ కార్యాచరణకు పదును పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే రోజా ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అభ్యర్థిగా రోజా పేరు ప్రకటించగానే రోజూ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసేవారు. నియోజకవర్గం మొత్తం కలియదిరిగే వారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం మొక్కుబడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికంతటికీ కారణం అడుగడుగునా ఎదురవుతున్న అసమ్మతి గళమేనని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో రోజాకు సహకరించిన చాలామంది ఈసారి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ మూలనైనా అసమ్మతి ఉంటే వారి వద్దక వెళ్లి బుజ్జగించడం చేస్తారు. గండం గట్టెక్కితే చాలనుకుంటారు. కానీ రోజా మాత్రం అసమ్మతి నేతలను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. దీంతో నియోజకవర్గంలోని ప్రధాన నాయకులు ప్రచారానికి వెళ్లకుండా తమ సొంత పనుల్లోనే ఉంటున్నారు. తిరుగుబాటు ధోరణిలో ఉన్న నాయకులు పార్టీకి దూరం కాకుండానే అనుకూలంగానే ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. కానీ రోజాను కలవడానికి ఇష్టపడటం లేదు. తమ సత్తా ఏమిటో చూపించాలనే దిశగా సాగుతున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు రోజా గెలుపుపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

తాజాగా నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాకు ప్రజల్లో చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని ఎస్‌బీఐ పురంలో ప్రచారానికి వెళ్లిన మంత్రి రోజాకు స్థానికుల నుంచి నిరసన సెగ ఎదురైంది. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తే మంత్రి రోజా పట్టించుకోలేదని ఎస్సీ కాలనీ వాసులు రోజా పర్యటనను అడ్డుకున్నారు జై భీమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక ప్రచారం చేయకుండానే రోజా అక్కడి నుంచి వెనుదిరిగారు.

టీడీపీకి కంచుకోట లాంటి నగరి నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో రోజా విజయం సాధించారు. ఈ సారి గెలుస్తారా అంటే ఆరు నెలల ముందు నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. అసలు రోజాకు వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వదని అనుకున్నారు. కానీ టిక్కెట్ ఇవ్వకపోతే ఆమె చేసే రచ్చ ద్వారా ఎక్కువ నష్టం జరుగుతుందని వైసీపీ హైకమాండ్ భయపడిందని… అందుకే మంత్రి పదవి కూడా అదే కారణంతో దక్కిందని టాక్. పదేళ్లుగా నగిరికి ఏమీ చేయలేకపోయిందని ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ అధికారంలో లేనప్పుడు ఏమీ చేయలేకపోయినా .. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో రోజాకు ఈసారి ఇదే ప్రధాన మైనస్ గా చెప్పొచ్చు. ఎప్పుడో తన పుట్టిన రోజుకో సారి ఓ వంద ఫ్యాన్లను స్కూళ్లకు కానుకగా ఇచ్చి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అంతకు మించి చేసిన అభివృద్ధేమీ లేదని అంటున్నారు. రోజాపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సోదరులిద్దర్నీ ముందు పెట్టి ఆమె వందల కోట్లు సంపాదించారని సొంత పార్టీ నేతలే మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.

మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే రోజా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇదంతా నియోజకవర్గంలో చర్చనీయాంశంగానే ఉంది. ఎవరితోనూ సఖ్యత ఉండరని స్థానిక నేతలు వాపోతున్నారు. నగరి నియోజకవర్గంలో ఒక్క మండలం నేతతో కూడా ఆమె సఖ్యతగా ఉండరని, స్థానికేతరురాలైన నప్పటికీ ఆమెను అక్కడి నేతలు రెండు సార్లు గెలిపించారు. నగరి నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ 5 మండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో పట్టున్న వారు ఉన్నారు.

నగరి మున్సిపల్‌ చైర్మన్‌తోనూ రోజాకు వివాదాలే. జడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ ఇబ్బందులే. రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని సవాల్ చేశారు. ఇప్పుడు వారంతా వ్యతిరేకంగానే పని చేస్తున్నారు రోజాకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రాజకీయం ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేతలు ఉన్నారంటే వారికి బలమైన సపోర్టు ఉన్నట్లే లెక్క. రోజా వ్యతిరేక వర్గానికి పెద్దిరెడ్డి సపోర్టు ఉన్నట్లు తెలుస్తోంది. నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా టాక్ నడుస్తోంది. రోజాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారికి పెద్దిరెడ్డి సపోర్ట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన గుప్పిట్లో ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నాలు. కానీ రోజా ఆయనకు వ్యతిరేక వర్గంగా మారిపోయారు.

రోజాను ఓడించడానికి పెద్దిరెడ్డి ప్లాన్ రెడీ చేసుకున్నారని ప్రచారం భారీగా జరుగుతోంది. గత రెండు సార్లు నేతలందరూ కృషి చేసినా స్వల్ప తేడాతోనే రోజా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో నగరిలో తమిళ ఓటర్లు కూడా ఎక్కువగా ఉంటారు. రోజా భర్త సెల్వమణి తమిళుడు. తమిళ పోరాటాల పేరుతో హడావుడి చేస్తూంటారు ఈ నేపధ్యం తమిళ ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడింది. కానీ ఇటీవల రజనీకాంత్ పై రోజా చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గంలోనూ వ్యతిరేకత వచ్చింది. ఈ సారి రోజాకు కలసి వచ్చే వారే లేరు. రోజా మొదటి సారి 800 ఓట్లు.. రెండో సారి 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఆమె నోటి దురుసుతో అన్ని వర్గాలు ఆమెకుదూరమవుతున్నాయని వైసీపీలోని నేతలే చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఆమెకు గుణపాఠం చెప్తాయని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu