అల.. వైకుంఠపురములో మూవీ రివ్యూ..

movie-poster
Release Date
January 12, 2020

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్ర టీజర్‌ హిట్‌.. ట్రైలర్‌ సూపర్‌ హిట్‌.. పాటలు సూపర్‌ డూపర్‌ హిట్టవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫలితం తర్వాత బన్ని గ్యాప్‌ తీసుకొని చేస్తున్న చిత్రం కావడం.. కేవలం తన మాటల మాంత్రికుడిగానే కాకుండా.. దర్శకత్వ తాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్‌ ఈ సినిమాకు డైరెక్ట్‌ చేస్తుండటం.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు సూపర్‌ హిట్‌లు సినిమాలు పడటంతో మామూలుగానే ‘అల.. వైకుంఠపురమలో’ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. దీంతో సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుందా? బన్ని తనదైన స్టైల్‌ నటనతో మెప్పించాడా? త్రివిక్రమ్‌ తన మార్క్‌ సినిమా చూపించాడా? సెన్సేషనల్‌ రికార్డులు సాధించిన తమన్‌ స్వరపరిచిన పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయా? ఓవరాల్‌గా సంక్రాంతి బరిలోకి దిగిన మెగా పుంజు విజయం సాధించాడా? అనేది సినిమా సమీక్షలో చూద్దాం..

కథ: బంటు (అల్లు అర్జున్‌), రాజ్‌ మనోహర్‌ (సుశాంత్‌)లు ఒకే ఆసుపత్రిలో ఒకే సమయానికి పుడతారు. అయితే బేసిక్‌గా బంటు ఫ్యామిలీ మిడిల్‌ క్లాస్‌ కాగా రాజ్‌ మనోహర్‌ది బాగా ఉన్నతమైన కుటుంబం. బంటు వాళ్ల నాన్న వాల్మీకి (మురళీ శర్మ) వీ ఏఆర్కే కంపెనీ అధినేత రామచంద్ర రావు (జయరామ్‌) దగ్గర పనిచేస్తుంటాడు. రామచంద్ర రావు, యశ్‌(టబు)ల కుమారుడే రాజ్‌ మనోహర్‌. అయితే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కావడం, తండ్రి వాల్మీకి పెట్టే ఓ రకమైన టార్చర్‌తో ఇబ్బందులు పడతాడు. అయితే ఈ క్రమంలోనే అమూల్య (పూజా హెగ్డే)తో బంటుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.

కాగా అప్పలనాయడు (సముద్రఖని) తన కొడుకు పైడితల్లి కోసం వీఏఆర్కే కంపెనీలో షేర్స్‌ కావాలని గొడవపెట్టుకుంటాడు. ఈ తరుణంలో రామచంద్ర రావుపై హత్యాయత్నం జరుగుతుంది. అయితే రామచంద్రరావును కాపాడిన బంటుకు ఓ షాకింగ్‌ నిజం తెలుస్తుంది. దీంతో రామచంద్రరావును కాపాడేందుకు వైకుంఠపురములో అనే బంగ్లాలోకి దిగుతాడు. అయితే చివరకు ఏం జరిగింది? అప్పలనాయుడు కుటుంబం నుంచి వీఆర్కే కంపెనీని, రామచంద్రరావు కుటుంబాన్ని కాపాడాడా? ఈ కథలోకి కాశీ(హర్షవర్దన్‌), సీత (సునీల్‌), పెద్దాయన (సచిన్‌), శేఖర్‌ (నవదీప్‌), ఎస్పీ(రాజేంద్ర ప్రసాద్‌) నివేదా పేతురాజ్‌లు ఎందుకు ఎంటరవుతారు? ఆస్పత్రిలో బంటుకు తెలిసిన నిజం ఏమిటి? రామచంద్రరావు అంటే వాల్మీకి ఎందుకు పడదు? బంటు రాజు ఎలా అయ్యాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అదే అసలు సినిమా కథ.

నటీనటులు: ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్‌.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఎమోషన్‌ సీన్లలో తేలిపోతాడనే చిన్న అపవాదు ఉండేది. అయితే ఈ సినిమాతో ఎమోషన్స్‌ అనే ముచ్చటను కూడా తీర్చేశాడు. బన్ని అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎనర్జీ, డ్యాన్స్‌లు, కామెడీ పంచింగ్‌లు వీటితో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.. మైమరిపించాడు. దాదాపు సినిమా మొత్తం అల్లు అర్జున్‌ చుట్టే తిరుగుతుంది. దీంతో ఆ బాధ్యతన బన్ని మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేశాడు. ఈ సినిమాతో నటుడిగా, హీరోగా వంద శాతం ప్రూవ్‌ చేసుకున్నాడు. అల్లు అర్జున్‌ తర్వాత చెప్పుకోవాల్సింది మురళీ శర్మ గురించి. కన్నింగ్‌, స్యాడిజం ఇలా పలు వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. కొన్ని సందర్బాల్లో మురళీ శర్మను చూస్తే ఆసహ్యం, కోపం, ఛీ అనిపించేలా అతని నటన ఉంటుంది. ముఖ్యంగా కొడుకుపై స్యాడిజం చూపించే తండ్రిగా మురళీ శర్మ జీవించాడు.

ఇక పూజా హేగ్డే చాలా అందంగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో బన్ని చెప్పినట్టు ‘మేడమ్‌ సర్‌.. మేడమ్‌ అంతే’ అనే విధంగా పూజా ఉంటుంది. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. చాలా మెచ్యూర్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇక సుశాంత్‌ సెటిల్డ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో విలన్‌గా కనిపించిన సముద్రఖనికి ఎక్కువ సీన్లు పడలేదు. అయితే డిఫరెంట్‌ మ్యానరిజంతో పర్వాలేదనపించాడు. సచిన్‌, జయరామ్‌లు కొన్ని ఎమోషన్స్‌ సీన్లలో కంటతడిపెట్టించారు. చాలా కాలంతర్వాత తెలుగు సినిమాలో కనిపించిన టబుకు పెద్ద క్యారెక్టర్‌ లభించకపో​యినప్పటకీ ఉన్నంతలో ఆకట్టుకుంది. నిన్నే పెళ్లాడతా సినిమాలో టబును చూసినట్టే ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ఇక రాహుల్‌ రామకృష్ణ, సునీల్‌, రాజేంద్ర ప్రసాద్‌, హర్షవర్దన్‌లు చేసే కామెడీ ఓ మోస్తారుగా ఉంటుంది. నవదీప్‌ ఉన్నతంలో ఉన్నంత పర్వాలేదనిపించాడు.

విశ్లేషణ: అల్లు అర్జున్, దర్శకుడు ‌.. సినిమా ఆరంభం చెప్పిన ఒకే మాట. సరదాగా ఓ సినిమా తీద్దాం అనుకున్నాం.. అలాగే తీశాం అని చెప్పారు. వారు చెప్పింది అక్షరాల నిజమని సినిమా చూస్తే అర్థమవుతుంది. త్రివిక్రమ్‌ మార్క్‌​ టేకింగ్‌.. అల్లు అర్జున్‌ కామెడీ టైమింగ్‌, నటన, డ్యాన్స్‌లు, పాటలు సింపుల్‌గా చెప్పాలంటే సినిమా ఇలాగే సరదా సరదాగా, సాఫీగా సాగుతూ వెళ్తుంది. ఎక్కడా బోర్‌ కొట్టదు.

అయితే సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అయితే కథ ముందే చెప్పేసి దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలోంచి లేవకుండా చేశాడు త్రివిక్రమ్‌. మొదట్లోనే సినిమా కథ చెప్పేసిన తర్వాత దర్శకుడు ఇంకా ఏం చేస్తాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా చేయడంలో దర్శకుడు విజయంతం అయ్యాడు. ఇక కథలో ఎలాంటి కొత్త దనం లేనప్పటికీ త్రివిక్రమ్‌పై నమ్మకంతో సినిమాకు అంగీకరించిన బన్ని గట్స్‌కు హ్యాట్సాఫ్‌. ఎందుకంటే గ్యాప్‌ తర్వాత వచ్చే సినిమా హిట్‌ సాధించాలి కానీ ఇరిటేట్‌ చేయకూడదు. అయితే బన్ని నమ్మకాన్ని త్రివిక్రమ్‌ నూటికి నూరుశాతం నిలబెట్టాడు.

ఇక ఇప్పటివరకు డ్యాన్స్‌ల్లో పలు వేరియేషన్స్‌తో కొత్తగా,స్టైల్‌గా చేసిన అల్లు అర్జున్‌.. ఈ సినిమాలో కొత్తగా, వైవిధ్యంగా, స్టైల్‌గా ఫైట్‌ చేశాడు. కొన్ని ఫైట్‌ సీన్లయితే వావ్‌ అనిపించేలా ఉన్నాయి. అలా కంపోజ్‌ చేశారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అందరూ అనుకున్నట్లు పాటలు సినిమాలో ఇరికిచ్చినట్లు కాకుండా సందర్బానుసారంగా వస్తాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ పాట సరైన సమయంలో పడుతుంది. ఇక త్రివిక్రమ్‌ సినిమాల్లోని పాటల్లో సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటల రచయితలు తమ సాహిత్యంతో సినిమా స్థాయిని మరింత పెంచారు.

హైలైట్స్‌ : అల్లు అర్జున్‌ నటన

డ్రాబ్యాక్స్ : సెకండ్ హాఫ్ కొన్నిసన్నివేశాలు

టైటిల్ : అల.. వైకుంఠపురములో
నటీనటులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, సముద్రఖని, జయరామ్‌, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌
దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత : అల్లు అరవింద్‌, రాధాకృష్ణ(చినబాబు)
సంగీతం :తమన్‌

చివరిగా : ‘అల వైకుంఠపురములో’ సర్.. సూపర్‌ అంతే..
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

'అల వైకుంఠపురములో' సర్.. సూపర్‌ అంతే..
Rating: 3/5

https://www.klapboardpost.com/