కండలు పెంచిన నవదీప్‌ .. బన్నీ కోసమేనా.!

డైరెక్టర్‌ తేజ వెండితెరకు పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకరు. ‘జై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవదీప్ స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. కానీ, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మొదటి సినిమా’, ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’, ‘చందమామ’ చిత్రాల్లో నవదీప్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ‘ఆర్య 2’లో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర పోషించిన నవదీప్ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో సుమారు 30 సినిమాల్లో నటించిన నవదీప్ చివరిగా కిందటేడాది వచ్చిన ‘నెక్ట్స్ ఏంటి’లో కనిపించారు. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటించనున్నారు.

ఇదిలా ఉంటే, నవదీప్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొత్త ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన కండలు తిరిగిన బాడీతో కనిపించారు. ఇప్పటి వరకు నవదీప్‌ను ఇలాంటి లుక్‌లో చూడలేదు. తాను ఈ విధంగా తయారవడానికి జిమ్ కోచ్ కృష్ణ సద్వాలే కారణమని నవదీప్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. ఈ విషయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, వివన్ భతేనా(‘రాజా ది గ్రేట్’ విలన్) తనకు ఎప్పుడూ స్ఫూర్తి అని నవదీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, బన్నీ సినిమా కోసమే నవదీప్ ఇలా కండల వీరుడిలా తయారయ్యారని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన యంగ్ విలన్ రోల్ పోషిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. నవదీప్ లుక్ చూస్తుంటే ఈ ప్రచారం వాస్తవమేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇప్పటికే హీరో సుశాంత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.