‘జెర్సీ’ పై అనుష్క ట్వీట్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ‘జెర్సీ’ సినిమా తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాను తాజాగా చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘జెర్సీ’… సినిమాలోని మ్యాచ్‌ చూసిన తర్వాత నేను పొందిన ఫీల్‌ను వివరించడానికి మాటలు ఉంటే బాగుండేదనిపిస్తోంది. నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌ (ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ). నాని, మిగిలిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ సినిమాను మాకిచ్చినందుకు ధన్యవాదాలు’ అని అనుష్క పోస్ట్‌ చేశారు.

ఈ చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ఇప్పటికే ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఎన్టీఆర్‌, సుధీర్‌బాబు, మంచు మనోజ్‌, హరీశ్‌ శంకర్‌ తదితరులు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అందరూ ప్రత్యేకించి నాని నటనను మెచ్చుకున్నారు. ‘జెర్సీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నాని ‘అర్జున్‌’ అనే క్రికెటర్‌గా కనిపించి అందరి ప్రశంసలు పొందారు. ఈ నెల 19న విడుదలైన చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది.