ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం

ఏపీ మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభమైన ఈ భేటీలో 8 అంశాలపై ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ 8 అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయా శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించారు.

సామాజిక పింఛనును రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ పెంచుకుంటూ పోతామని ఎన్నికల ముందు జగన్‌ ప్రకటించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ.250 పెంచుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే తొలి సంతకం చేశారు. ఈ పెంపును కేబినెట్‌ ఆమోదించనుంది. అలాగే సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్లోకి ప్రవేశించినపుడు ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. దానికీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. అక్టోబరు నుంచి అమలు చేయనున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 చెల్లించే పథకానికి కేబినెట్‌ సమ్మతం తెలపనుంది. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించేందుకు అనుమతించనుంది. అలాగే కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, హోంగార్డుల వేతనాల పెంపు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. చర్చ అనంతరం వీటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వీటితోపాటు మరికొన్ని కొత్త అంశాలూ చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.