Homeపొలిటికల్AP Politics: ఏపీలో భద్రతపై సామాన్యుడి బెంబేలు!

AP Politics: ఏపీలో భద్రతపై సామాన్యుడి బెంబేలు!

Common people worry about s AP Politics,tdp,ysrcp,janasena,Bjp,congress

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జగన్ పాలనలో అనేక విధ్వంసాలు జరిగిన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఆగడాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామా అని ఎదురుచూసిన ప్రజలు కసితో ఓటేశారు. జూన్ 4న వెలువడబోయే ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయ ఢంకా మోగించబోతుంది.. ఇదీ టీడీపీ నాయకులు ఘంటాపథంగా చెప్తున్న అభిప్రాయం.

ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పలుచోట్ల టీడీపీ నేతలపై దాడులు చేశారు. పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి స్వయంగా ఓ పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన వీడియోలు మనం మీడియాలో చూశాం. దీనికి సంబంధించి సీరియస్ అయిన ఎన్నికల సంఘం అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి రక్షణపొందారు. ఎన్నికల ఫలితాలు అయిపోయే వరకు అనగా జూన్ 5 వరకు అతడిని అరెస్ట్ చేయొద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఎన్నికల్లో మాత్రమే కాదు.. ఎన్నికల ఫలితాలు వెల్లడి అనంతరం ఏపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసింది. ఇంటిలిజెన్స్ సమాచారంతో ఇప్పటికే అదనపు బలగాలను సమస్యాత్మక ప్రాంతాలలో మోహరించారు. పచ్చదనానికి, వెటకారానికి మారు పేరుగా నిలిచే ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఇందుకు వేదిక కావడంపై ఏపీలో భద్రతపై ప్రజల్లో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.

వైస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన విధ్వంస కాండ గత నాలుగైదు రోజులుగా రోజుకొకటి చొప్పున వీడియోలతో సహా బయటకు రావడంతో ప్రజల్లో ఓ స్పష్టత వచ్చేసింది. వీటన్నింటికి తోడు కేంద్ర హోంశాఖ తాజాగా ఏపీ డీజీపీకి పంపిన లేఖతో, సామాన్య ప్రజలకే కాదు, ప్రధాని పర్యటిస్తున్న సమయంలో కూడా భద్రత కొరవడిందని స్పష్టమయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ మే 8వ తేదీన విజయవాడలో రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్‌షోకి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ రోడ్ షోలో కేంద్ర నిబంధనలు పాటించకపోవడంతో పాటు భద్రతా చర్యలు తీసుకోవడంలో ఏపీ పోలీసులు పూర్తి విఫలమయ్యారు.

ప్రధాని మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు.. రోడ్‌షో ప్రారంభమైన తర్వాత చివరిలో గ్రౌండ్‌లో డ్రోన్‌లు ఎగరవేశారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్‌పీజీ ముందుగానే ప్రధాని రోడ్‌షో పర్యటించే ప్రాంతాన్ని నోఫ్లైజోన్‌గా ప్రకటించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు లెక్కచేయలేదు. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని దేశంలోని వ్యవస్థలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడంలేదు. అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ ఎంతకైనా దిగజారే పరిస్థితిని తీసుకొస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏపీ పోలీసుల తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల అలసత్వంపై సీరియస్ అయింది. ఈ మేరకు ఘాటైన వ్యాఖ్యలతో ఏపీ డీజీపీకి లేఖ పంపింది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ప్రధాని పర్యటిస్తున్న ప్రాంతం ‘నో ఫ్లైయింగ్ జోన్’గా ప్రకటించినప్పటికీ.. ఆరోజు ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలోనూ విజయవాడ, బందర్ రోడ్డులో డ్రోన్లు ఎగరడం భద్రతా లోపాలను ఎత్తిచూపినట్లయ్యింది. ఒక డ్రోన్‌ను ఎస్పీజీ సిబ్బంది నిర్వీర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. దీనిపై ఎస్‌పీజీ సీరియస్ అయింది. ఇది భద్రతా వైఫల్యమేనని మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీకి కేంద్ర హోంశాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది.

ఏకంగా ప్రధాని పర్యటన చేస్తున్న సమయంలో కూడా భద్రత కల్పించడంలో ఏపీ పోలీసులు విఫలం కావడం అంటే, అసలు ఏపీలో సామాన్యులకు భద్రత ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతకుముందు కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభలోనూ భద్రతా వైఫల్యంపై కేంద్రం తీవ్ర చర్యలు తీసుకుంది. పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇప్పుడు విజయవాడ రోడ్‌షోలో డ్రోన్‌లు ఎగరవేత ఘటనపై కూడా పోలీసు అధికారులపై చర్యలు తప్పవని తెలుస్తోంది.

ప్రస్తుతం జూన్ 4న వెలువడబోయే ఎన్నికల ఫలితాలపైనే అందరి చూపు ఉంది. ఈ అరాచక ప్రభుత్వం పోవాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. మరోసారి అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పక్షం ఉవ్విళ్లూరుతోంది. స్తబ్దుగా మారిన రాజకీయంలో వైసీపీ పోలింగ్ విధ్వంస వీడియోలు హల్చల్ చేస్తుండగా, తాజాగా కేంద్రం సీరియస్ కావడం జగన్ అండ్ కోకు మింగుడు పడని అంశమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu