HomeTelugu Newsకోడెల మరణంపై బాలయ్య స్పందన

కోడెల మరణంపై బాలయ్య స్పందన

6 14ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ మరణం తెలుగుదేశం పార్టీని శోకసంద్రంలో ముంచేసింది. ఆయన మరణవార్త తెలుసుకుని ఒక్కొక్కరుగా ఆస్పత్రికి వచ్చి పరామర్శిస్తున్నారు. ఈయన మరణంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. బసవతారకం హాస్పిటల్ వచ్చి కోడెల భౌతికకాయాన్ని సందర్శించిన బాలయ్య.. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించారు. కోడెల మరణం జీర్ణించుకోలేని విషయం అని చెప్పారు ఆయన. ముఖ్యంగా ఇది చాలా దుర్దినం అని తెలిపాడు బాలయ్య. బసవతారకం ఆస్పత్రి మొదలు పెట్టినపుడు ఆయనే ఫౌండర్ ఛైర్మెన్ అని గుర్తు చేసుకున్నాడు బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీలోనే కాదు.. తమ కుటుంబంలో కూడా ఎప్పుడూ కోడెలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పారు బాలయ్య. భౌతికంగా ఆయన మన మధ్య లేరు.. ఇది నిజంగానే నమ్మలేని నిజం అంటున్నాడు బాలయ్య.

కోడెలతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రాజకీయ నాయకుడిగానే కాకుండా వైద్యుడిగా కూడా ఎనలేని సేవలు అందించిన కోడెలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరంటున్నాడు బాలయ్య. సమాజానికి, ప్రజలకు ఎన్నో సేవలు అందించాడని కొనియాడారు. కోడెల భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారంటున్నాడు ఈయన. అప్పట్లో అమ్మగారి జ్ఞాపకార్థం నాన్నగారు ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నపుడు ఆయనతో పాటు కోడెల ముందడుగు వేసారని గుర్తు చేసాడు బాలయ్య. ఆస్పత్రికి పడిన తొలి ఇటుక నుంచి కూడా ఆయన తోడుగా ఉన్నాడని ప్రశంసించాడు బాలయ్య. ఈ ఆస్పత్రి కోసం అన్ని రకాలుగా సేవలు అందించారని.. వైద్యుడిగా ఉన్నారని.. ఛైర్మెన్‌గా పని చేసారని.. హాస్పిటల్ పరికరాల విషయంలో కానీ.. నిధులు సేకరించడంలో కానీ కోడెల పాత్ర మరవలేమని చెప్పాడు బాలయ్య.

ఎంతోమందికి ఎంతో సేవలు అందించిన ఈయనకు ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం అని తెలిపాడు బాలయ్య. మొదట్నుంచీ ఎన్నో పదవులను ఆయన అలంకరించినా కూడా ఆయనకే అవి అలంకరణగా ఉన్నాయని చెప్పాడు బాలయ్య. హోం శాఖ, పంచాయతి, ఇరిగేషన్ ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేసారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సేవలు అందించిన ఈయన.. మొదటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గానూ పని చేసారని గుర్తు చేసారు. శాశ్వతంగా నిలిచిపోయేలా సేవలు అందించిన ఆయన ఈ రోజు మనమధ్య లేరంటే నమ్మలేం.. షాక్ లో ఉన్నామని.. నామా నాగేశ్వరరావు తనకు ఈ విషయం చెప్పగానే షాక్‌లోకి వెళ్లిపోయానని చెప్పాడు బాలయ్య. భగవంతుడు అన్యాయం చేసాడని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు. తెలుగు ప్రజలందరికీ ఇది తీరనిలోటని.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరని నష్టమని.. ఆయన్ని స్పూర్థిగా తీసుకుని.. కలలు సాకారం చేయాలని కోరుకుందామంటూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసాడు బాలకృష్ణ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu