త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ వెల్లడించారు. శ్రీనివాస్‌ ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సినిమా ‘రాచ్చసన్‌’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి రమేష్‌ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్‌, సురేష్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ‘రాక్షసుడు’ విజయంతో ఆనందంలో మునిగితేలుతున్న తన కుమారుడి పెళ్లి గురించి సురేష్‌ ప్రస్తావించారు. ‘త్వరలోనే శ్రీనివాస్‌ వివాహం జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా.. బయట నుంచి వాడికి తగిన అమ్మాయి కోసం చూస్తున్నా. ‘రాక్షసుడు’ సినిమాను సక్సెస్‌ చేసిన తెలుగు వారికి ధన్యవాదాలు. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌తో పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నా. ఇప్పటికే స్క్రిప్టు పని మొదలైంది. సరైన దర్శకుడికి కోసం వెతుకుతున్నా. శ్రీనివాస్‌ పాత సినిమాలు బాక్సాఫీసు వద్ద రూ.40 కోట్ల వరకూ రాబట్టాయి. కానీ ఆ సినిమాల్ని అధిక బడ్జెట్‌తో నిర్మించడం వల్ల ఫెయిల్యూర్‌గా నిలిచాయి. కాబట్టి బడ్జెట్‌ను నియంత్రణలో ఉంచుకుంటే సినిమా హిట్‌కు ఆస్కారం ఉంటుంది’ అని ఆయన చెప్పారు.

శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కథా బలం ఉన్న చిత్రాలు తప్పక విజయం సాధిస్తాయనడానికి ఈ చిత్రమే నిదర్శనమని చెప్పారు. అనంతరం వీరిద్దరూ కలిసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్స్ అసోసియేషన్, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్‌ల అభివృద్ధికి తమవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.