బిగ్‌బాస్‌ 12 విజేతగా దీపికా కక్కర్‌..!

ఆదివారం రాత్రి బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్ ఖాన్‌ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘బిగ్‌బాస్’ సీజన్‌ 12 విజేతగా హిందీ బుల్లితెర నటి దీపికా కక్కర్‌ నిలిచారు ఈ కార్యక్రమంలో సల్లూభాయ్‌ విజేతను ప్రకటించారు. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ కూడా పాల్గొన్నారు. శ్రీశాంత్‌, దీపిక మధ్య జరిగిన సంఘటనలే వారిని టాప్‌ ఫైనలిస్ట్‌లుగా నిలబెట్టాయి. కానీ విజయం మాత్రం దీపికనే వరించింది. శ్రీశాంత్‌ రన్నరప్‌గా నిలిచారు.

దీపికకు రూ.30లక్షల నగదు, ట్రోఫీను అందజేశారు. గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంలో ఓ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టాప్‌ 3 కంటెస్టెంట్లయిన దీపిక, శ్రీశాంత్‌, దీపక్‌లకు సల్మాన్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. విజేతను ప్రకటించక ముందే ఎవరో ఒకరు రూ.20 లక్షలతో షో వదిలి వెళ్లిపోవాలని చెప్పారు. ఇందుకు దీపిక, శ్రీశాంత్‌ ఒప్పుకోలేదు. ప్రైజ్‌ మనీని అందుకునేందుకు దీపక్‌ ముందుకు రావడంతో ఆయనకు రూ.20లక్షలు ఇచ్చి సాగనంపారు. ఇప్పటివరకు హిందీ బిగ్‌బాస్‌ చరిత్రలో విజేతను ప్రకటించకముందే ఇంత మొత్తంలో ఏ కంటెస్టెంట్‌కీ ప్రైజ్‌మనీ ఇవ్వలేదు.

హిందీలో పాపులర్‌ ధారావాహిక అయిన ‘ససురాల్‌ సిమర్‌ కా’ ద్వారా దీపిక పాపులర్‌ అయ్యారు. ‘ఝలక్‌ దిఖ్‌లాజా’, ‘నచ్‌ బలియే’ లాంటి డ్యాన్స్‌ రియాల్టీ షోలలోనూ పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ‘పల్టాన్‌’ చిత్రం ద్వారా దీపిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించక ముందు దీపిక జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలో మూడేళ్ల పాటు ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంవైపు వచ్చారు. తన సహ నటుడైన షోయబ్‌ ఇబ్రహీంను దీపిక ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే షోయబ్‌ ముస్లిం కావడంతో ఇస్లాం మతంలోకి మారి, ఫైజా అని పేరు మార్చుకుని మరీ అతన్ని పెళ్లాడారు. దీపిక మతం మారడంపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి.