రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌.. కేసు నమోదు

హిందువులు దైవంగా పూజించే రాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశం పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో మహేష్‌పై కేసు నమోదైంది. శ్రీరాముడి, సీతాదేవిపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ప్రముఖ న్యాయవాది కరుణసాగర్‌ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కత్తి మహేష్‌ పై నాంపల్లిలోనే కాకుండా పలు పీఎస్‌లలో ఫిర్యాదులు అందాయి. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.

కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రాముడిని, సీతను కించపరిచేలా కత్తి మహేష్‌ వ్యాఖ్యలు చేశారు. రాముడి ఫేవరేట్ డిష్ నెమలి తొడ, జింక మాంసం అని.. సీత బంగారు జింకను తెమ్మన్నది తినడానికే అని కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి అంతఃపురంలో చాలా మంది ఉంపుడుగత్తెలు ఉండేవారంటూ ఏకపత్నీవ్రతుడైన రాముడిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాముడిని పూజించే కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలా మాట్లడాడు.

కత్తి మహేశ్ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడ్డారు. అతడిపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. కత్తి మహేష్‌ను దేశం నుంచి బహిష్కరించాలని మరి కొందరు డిమాండ్ చేశారు. అటు ఏపీలోనూ పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై ఫిర్యాదులు అందాయి. రాముడి పట్ల తాను చేసిన కామెంట్లను కత్తి మహేష్‌ సమర్థించుకున్నారు. ‘నేను మీ కంటే భయంకరమైన హిందువును.. జాగ్రత్త! గుడ్డిగా ఫాలో అయ్యే రకాన్ని కాదు నేను. దళిత చార్వాకుడిని’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పుల్లెల శ్రీరామచంద్రుడి వాల్మీకి రామాయణం అనువాదం ఉత్తరకాండం, 42 సర్గ,18-22 వచనాలు, 48-49 పేజీలు; యుద్ధంకాండం పేజీ 380 – 81 చూడండి అంటూ విమర్శకులకు ఆయన బదులిచ్చారు.

CLICK HERE!! For the aha Latest Updates