కేసీఆర్‌కి అభినందనలు తెలిపిన చంద్రబాబు

ఈరోజు వెలువడిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి కూటమిగా పోటీకి దిగిన చంద్రబాబు ప్రజాతీర్పును గౌరవిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడిందని, ఐదేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైందని చంద్రబాబు అన్నారు. కమలం పార్టీ పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. ఐదేళ్లలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని అన్ని వర్గాలూ గుర్తించాయని, ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు. భాజపాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంది. హైదరాబాద్‌, ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మహాకూటమి తరఫున కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates