మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ‌ నియోజకవర్గాల వారీగా నేతలతో చంద్రబాబు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత రాజంపేట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును ప్రకటించారు. అనంతరం పీలేరు అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌ రెడ్డి, రాయచోటి అభ్యర్థిగా రమేశ్‌కుమార్‌ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూషరెడ్డి, రైల్వేకోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు నరసింహ ప్రసాద్‌ పేర్లను సమావేశంలోనే సీఎం ఖరారు చేశారు. తంబళ్లపల్లి అభ్యర్థి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈస్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా శంకర్‌యాదవ్‌ ఉన్నారు. మిగతా అభ్యర్థుల విషయంలో వారంలోపు నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సర్వేల ఫలితాలు, స్థానిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణల్ని బేరీజు వేసుకుని ఆయన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

మరోవైపు కడప పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల నేతలతోనూ చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. కడప జిల్లా మైదుకూరు టికెట్‌ను తనకు కేటాయించాలని కోరుతూ మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి నిన్నరాత్రి చంద్రబాబును కలిశారు. అదే సీటు కోసం టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ కూడా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిన తర్వాత కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.