ఆటో నడిపిన చంద్రబాబు.. హర్షం వ్యక్తం చేసిన డ్రైవర్లు

ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పెద్దసంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్లనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఆటోవాలాలకు ముఖ్యమంత్రి మరిన్ని వరాలు కురిపించారు. ఆటో డ్రైవర్‌ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణంలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు. ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఆటోడ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటాన్నారు. ‘ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి.. మీ క్షేమం నేను చూసుకుంటాను’ అని వారితో సీఎం అన్నారు.