చంద్రబాబుదీ మంచి ఆశయమే: పవన్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను తెలుగువాడినని చెప్పడానికే పంచె కడుతున్నానని అన్నారు. గోదావరి జిల్లాలంటే అందరికీ ఇష్టం ఉంటుందని, అలాంటి జిల్లాలో ఆక్వా భూతంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, పెట్టుబడులు రావాలని ఆకాంక్షించిన పవన్‌.. ప్రజలను భయపెట్టి భూములు లాక్కోకూడదని ప్రభుత్వానికి సూచించారు.

రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని, కానీ.. వాస్తవంగా అలా జరగడంలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ఉన్నత ఆశయంతో ధవళేశ్వరం ఆనకట్ట కట్టారని, సీఎం చంద్రబాబు కూడా మంచి ఆశయంతో పోలవరం కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సమాజం, దేశం కోసం చనిపోవడానికి కూడా తాను సిద్ధమని మరోసారి ప్రకటించారు. రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని తెలిపారు. ప్రస్తుతానికి తూ.గో జిల్లాలో పితాని బాలకృష్ణ పేరు మాత్రమే ప్రకటించామన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు చూసి మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లి మళ్లీ తూ.గో జిల్లాలో పర్యటిస్తానని పేర్కొన్నారు.