‘ఇంద్ర’లో బాలనటుడు.. సమంత సినిమాలో ఇప్పుడిలా.!

‘చూడాలని ఉంది’, ‘యువరాజు’ సహా చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఇంద్ర’లో చిన్నప్పటి చిరుగా కత్తిపట్టి.. తొడకొట్టి అభిమానులను అలరించిన బాలనటుడిగా మెప్పించాడు మాస్టర్‌ తేజ ఇప్పుడు పెద్దవాడై.. మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఓ బేబీ’. ఇందులో సమంత మనవడిగా తేజ కనిపించనున్నాడు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.. ‘ఒక మనిషికి సెకండ్‌ లైఫ్ వస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ. అయితే, ఈ సినిమా నాకు సెకండ్‌ లైఫ్‌. మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభిస్తున్నా. ‘ఓ బేబీలో సమంతగారు ఓల్డ్‌ ఏజ్‌ నుంచి యంగ్‌ ఏజ్‌కు వస్తారు. నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి పెద్దగా అయ్యాను. అంతే తేడా. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఎంత స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చాడు.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు ‘ఓ బేబీ’ ని నిర్మిస్తున్నారు. లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకురానుంది.