చిరంజీవి అందుకే దూరంగా ఉన్నారా?

చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చాలాకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. 3 దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలిన రారాజు చిరంజీవి మళ్లీ సినిమాల్లోనే కొనసాగుతారా లేక వచ్చే ఎన్నికల్లో తమ్ముడు జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తారా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రాజకీయ పార్టీ స్థాపించాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవి 150వ చిత్రం “ఖైదీ నం.150″తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ “సైరా”లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి దూరమైనట్లేనని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తమ్ముడు తరపున ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొనే అవకాశమూ లేకపోలేదనిపిస్తోంది.